Fake News, Telugu
 

ఢిల్లీ లోని జఫరాబాద్ లో కాల్పులు జరిపింది అనురాగ్ మిశ్రా కాదు

0

ఢిల్లీ లోని జఫరాబాద్ లో ఫిబ్రవరి 24 న ఒక వ్యక్తి పిస్టల్ తో అనేక రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే, ఆ కాల్పులు జరిపింది ఆర్ఎస్ఎస్ వ్యక్తి అనురాగ్ మిశ్రా అని చెప్తూ అతనికి సంబంధించిన ఫోటోలను కొంతమంది ఫేస్బుక్ యూజర్స్ పోస్టు చేస్తున్నారు. పోస్టులో చెప్పిన విషయంలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఢిల్లీ లోని జఫరాబాద్ లో కాల్పులు జరిపింది ఆర్ఎస్ఎస్ వ్యక్తి ‘అనురాగ్ మిశ్రా’. 

ఫాక్ట్ (నిజం): ఢిల్లీ లోని జఫరాబాద్ లో కాల్పులు జరిపిన వ్యక్తి పేరు ‘మహమ్మద్ షారుఖ్’. పోస్టులోని ఒక ఫొటోలో అతను ‘ఎర్ర చొక్కా’ లో కనిపిస్తాడు. మిగతా ఫొటోల్లో ఉన్న వ్యక్తి పేరు ‘అనురాగ్ మిశ్ర’. జఫరాబాద్ లో కాల్పులు జరిపింది అనురాగ్ మిశ్రా కాదు. కావున, ఫొటోల్లో ఉన్నది ఇద్దరు వేరు వేరు వ్యక్తులు మరియు పోస్టులో చెప్పింది తప్పు.    

ఢిల్లీ లోని జఫరాబాద్ లో ఫిబ్రవరి 24 న ‘ఎర్ర రంగు చొక్కా మరియు నీలం రంగు ప్యాంటు’ వేసుకున్న వ్యక్తి పిస్టల్ తో అనేక రౌండ్లు కాల్పులు జరిపాడని ‘Hindustan Times’ కథనం ద్వారా తెలుస్తుంది. ఆ కథనంలో అతనికి సంబంధించిన ఫోటో కూడా ఉంటుంది. ‘ANI’ వారి ఒక ట్వీట్ ద్వారా కాల్పులు జరిపిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు ‘మహమ్మద్ షారుఖ్’ గా గుర్తించినట్లు తెలుస్తుంది. ఇంకొక ట్వీట్ ద్వారా ‘మహమ్మద్ షారుఖ్’ ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల నిర్బంధనలో ఉన్నాడని తెలుస్తుంది.

జఫరాబాద్ లో కాల్పులు జరిపిన వ్యక్తి ఫోటోని మరియు అనురాగ్ మిశ్రా ఫేస్బుక్ ప్రొఫైల్ లో ఉన్న ఫోటోలను పోల్చి చూసినప్పుడు, వారు ఇద్దరు వేరు వేరు వ్యక్తులని స్పష్టంగా తెలుస్తుంది. ఆ రెండు ఫోటోల్లోని వ్యక్తుల కళ్ళు, కనుబొమ్మలు మరియు ముక్కుకి సంబంధించిన తేడాలను గమనించవచ్చు.

అంతేకాదు, తన ఫోటోలు జఫరాబాద్ లో కాల్పులు జరిపిన వ్యక్తి ఫోటోలు గా సోషల్ మీడియా లో విస్తారంగా ప్రచారం అవ్వడంతో, ఆ తప్పుడు ప్రచారం చేస్తున్న వారి పైన పోలీసు కేసు పెడతానని అనురాగ్ మిశ్రా ఒక పోస్టు లో చెప్పాడు. అదే విషయాన్ని ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా చెప్పాడు.

చివరిగా, ఢిల్లీ లోని జఫరాబాద్ లో కాల్పులు జరిపింది అనురాగ్ మిశ్రా కాదు. ఆ ఘటనకు సంబంధంలేని వ్యక్తి ఫోటోలను తప్పుగా షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll