ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) వారు విడుదల చేసిన growth forecast గణాంకాలను వివరిస్తూ 2020వ సంవత్సరానికిగాను భారత దేశ GDP వృద్ధి అంచనా 1.9% అని, అన్ని దేశాలకన్నా భారత దేశ వృద్ధి అంచనా ముందుందని అని చెప్తూ ఉన్న యూట్యూబ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: IMF డేటా ప్రకారం 2020వ సంవత్సరానికిగాను భారత దేశ వృద్ధి అంచనా 1.9%, అన్ని దేశాలకన్నా భారత దేశ వృద్ధి అంచనా ఎక్కువ.
ఫాక్ట్(నిజం): IMF ఏప్రిల్ 2020లో విడుదల చేసిన డేటా ప్రకారం భారత దేశ GDP వృద్ధి అంచనా 1.9%. కాని జూన్ 2020లో విడుదల చేసిన డేటా ప్రకారం భారత దేశ GDP వృద్ధి అంచనా -4.2% . దీన్నిబట్టి పాత డేటాని ప్రచారం చేస్తున్నారని చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఈ గణాంకాలకు సంబంధించి మరింత సమాచారం కొరకు IMF వెబ్సైటు లో వెతకగా,ఈ వీడియోలో చెప్పిన గణాంకాలు, IMF ఏప్రిల్ 2020లో వివిధ దేశాల వృద్ధిని అంచనా వేస్తూ విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ అనే నివేదిక లోని నుండి సేకరించినట్టుగా తెలిసింది.
ఐతే IMF జూన్ 2020లో వివిధ దేశాల వృద్ధిని అంచనా వేస్తూ మరొక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2020వ సంవత్సరానికిగాను భారత దేశ GDP వృద్ధి అంచనా -4.5% గా ఉంది, చైనా GDP వృద్ధి అంచనా 1.0%గా ఉంది. దీన్నిబట్టి పాత గణాంకాలు ప్రచారం చేస్తున్నట్టు చెప్పొచ్చు.
వివిధ దేశాల GDP వృద్ధిని అంచనా వేస్తూ కేవలం IMF కాకుండా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ADB), వరల్డ్ బ్యాంకు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, వంటి సంస్థలు కూడా నివేదికలు విడుదల చేస్తుంటారు.
వరల్డ్ బ్యాంకు జూన్ 2020లో ‘వరల్డ్ ఎకనామిక్ ప్రాస్పెక్టస్’ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో 2020వ సంవత్సరంకి గాను వివిధ దేశాల వృద్ధిని అంచనా వేసింది. ఈ నివేదికలో 2020వ సంవత్సరంకి గాను భారత దేశ GDP వృద్ధి -3.2%గా అంచనా వేసింది.
అలాగే ‘ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు’ విడుదల చేసిన వృద్ధి అంచనాల ప్రకారం 2020వ సంవత్సరానికిగాను భారత దేశ GDP వృద్ధి -4.0% ఉంటుందని అంచనా.
చివరగా, IMF జూన్ 2020లో విడుదల చేసిన డేటా ప్రకారం భారత దేశ GDP వృద్ధి అంచనా -4.2%.