Fake News, Telugu
 

2024 ఎన్నికల్లో మోదీని గద్దె దించడానికి అయ్యే ఖర్చు తాను భరిస్తానని జార్జ్ సోరోస్ అనలేదు

0

‘2024 భారత ఎన్నికల్లో నరేంద్ర మోదీని గద్దె దించడానికయ్యే ఖర్చు భరించడానికి నేను సిద్ధం’ అని జార్జ్ సోరోస్ అన్నట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘2024 భారత ఎన్నికల్లో మోదీని గద్దె దించడానికయ్యే ఖర్చు భరించడానికి నేను సిద్ధం’ – జార్జ్ సోరోస్

ఫాక్ట్(నిజం): ఇటీవల జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (MSC)లో సోరోస్ మాట్లాడుతూ అదానీ గ్రూప్‌ వ్యవహారంలో మోదీపై పలు విమర్శలు చేసారు. ఐతే తన ప్రసంగంలో ఎక్కడా కూడా 2024 ఎన్నికల్లో గద్దె దింపడం గురించి సోరోస్ మాట్లాడలేదు. గతంలో కూడా సోరోస్ మోదీపై విమర్శలు చేసినప్పటికీ వైరల్ అవుతున్న వ్యాఖ్యలు మాత్రం చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ (MSC)లో అమెరికన్ వ్యాపారవేత్త మరియు ఫిలాంత్రోపిస్ట్ జార్జ్ సోరోస్ మాట్లాడుతూ మోదీపై పలు విమర్శలు చేయడంతో పాటు భారత్‌లోని పరిస్థితులపై కూడా వ్యాఖ్యానించాడు.

మోదీపై మాట్లాడుతూ, భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వాది కాదని, మోదీ వేగంగా నాయకుడిగా ఎదగడానికి భారతీయ ముస్లింలపై హింసే ప్రధాన కారణమని సోరోస్  అన్నాడు.

అదానీ గ్రూప్‌ వ్యవహారం నేపథ్యంలో ‘గౌతమ్ అదానీ కేసులో మోదీ ప్రస్తుతం మౌనంగా ఉన్నారు, అయితే విదేశీ పెట్టుబడిదారుల ప్రశ్నలకు మరియు పార్లమెంటులో సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. దీంతో ప్రభుత్వంపై వారికి ఉన్న పట్టు సన్నగిల్లుతుంది’ అని సోరోస్ వ్యాఖ్యానించాడు. ‘ఇది భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ పునరుజ్జీవనానికి దారితీస్తుందని’ కూడా ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ ప్రసంగానికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

దాదాపు 40 నిముషాల పైనే మాట్లాడిన సోరోస్ మోదీ, భారత్‌తో పాటు వాతావరణంలో మార్పులు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, టర్కీ భూకంపం, చైనా వైఫల్యాల గురించి కూడా మాట్లాడాడు.

ఐతే ఈ ప్రసంగంలో సోరోస్ ఎక్కడ కూడా 2024 ఎన్నికల గురించి గానీ, మోదీని వచ్చే ఎన్నికల్లో గద్దె దింపడం గురించి గానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో కూడా మోదీపై సోరోస్ విమర్శలు చేసినప్పటికీ పోస్టులో చెప్తున్న వ్యాఖ్యలు మాత్రం ఎప్పుడూ అనలేదు. ఒకవేళ సోరోస్ నిజంగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే భారత మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కానీ అలాంటి రిపోర్ట్స్ ఏవి లేవు.

సోరోస్ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో నిరాధార వార్తలు

సోరోస్ వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ అంశానికి సంబంధించి నిరాధార వార్తలు చాలా షేర్ అవుతున్నాయి. ‘భారత్‌లో BJPకి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాయడానికి మీడియాకు మొదటి విడతగా 8 వేల కోట్లు పంపిణీ చేసిన సోరోస్ ఏజెంట్స్’, ‘మోడీ ఆలోచనా విధానాన్ని తెలుసుకొనెందుకు మిలియన్ డాలర్ పెట్టుబడితో విశ్వవిద్యాలయం నెలకొల్పినట్టు’ పలు రకాల నిరాధార వార్తలను సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

చివరగా, 2024 ఎన్నికల్లో మోదీని గద్దె దించడానికి అయ్యే ఖర్చు తాను భరిస్తానని జార్జ్ సోరోస్ అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll