Fake News, Telugu
 

నోబెల్ శాంతి బహుమతికి గాంధీ నామినేట్ అయ్యింది ఐదు సార్లు మాత్రమే; కమిటీ సభ్యులు గాంధీకి అవార్డు ఇవ్వకపోవడం గురుంచి బహిరంగంగా విచారం కూడా వ్యక్తం చేశారు

0

గాంధీ మరియు నెహ్రూ 11 & 13 సార్లు  నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ ఐనప్పటికీ నోబెల్ ఫౌండేషన్  వాటిని తిరస్కరించింది అంటూ ఒక సమాచారం సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. ఈ కథనం ద్వారా ఈ వార్తకు సంబంధించి నిజమేంటో తెలుసుకుంద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గాంధీ మరియు నెహ్రూ 11 & 13 సార్లు  నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ అయ్యినప్పటికీ నోబెల్ ఫౌండేషన్  వాటిని తిరస్కరించింది.

ఫాక్ట్(నిజం): నోబెల్ శాంతి బహుమతికి గాంధీ ఐదు సార్లు నామినేట్ అయ్యారు. అలాగే నెహ్రు ఈ బహుమతికి ఏడు సార్లు నామినేట్ అయ్యారు. 1948లో గాంధీ చనిపోయిన అనంతరం ఆయనకు ఈ బహుమతి అందిద్దామని ఫౌండేషన్ అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అలా జరగలేదని తెలిపింది. ఐతే ఆ ఏడాది నోబెల్ బహుమతిని ఎవరకీ ఇవ్వలేదు. అంతే కాదు, నోబెల్ కమిటీ తరువాతి సభ్యులు గాంధీకి అవార్డు ఇవ్వకపోవడం గురుంచి బహిరంగంగా విచారం కూడా వ్యక్తం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న సమాచారంలో చెప్తున్నట్టే గాంధీ మరియు నెహ్రు పలు సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినా వారికి మాత్రం బహుమతి లభించలేదు. ఐతే వీరు ఎన్ని సార్లు నామినేట్ అయ్యారు అన్న విషయానికి సంబంధించి కొన్ని పొరపాట్లు ఉన్నాయి.

గాంధీ & నెహ్రు నామినేషన్స్ :

1937-48 మధ్యలో గాంధీ నోబెల్ శాంతి పురస్కారానికి 5 సార్లు నామినేట్ అయ్యారు. 1937, 1938, 1939, 1947, 1948లలో మొత్తం ఐదు సార్లు నోబెల్ శాంతి పురస్కారం కోసం మహాత్మా గాంధీ పేరు నామినేట్ అయ్యింది. ఐతే ఈ కాలంలో మొత్తం 12 మంది/వ్యవస్థలు గాంధీని నామినేట్ చేశాయి. ఒకే సంవత్సరంలో పలువురు గాంధీని నామినేట్ చేశారు.

ఉదాహరణకు 1947లో ఖేర్, మావలంకర్ మరియు గోవింద్ భల్లభ్ పంత్ ముగ్గురు గాంధీను నామినేట్ చేశారు. ఇలా ఈ ఐదు సంవత్సరాలలో మొత్తం 12 నామినేషన్స్ గాంధీను ఈ బహుమతికి ప్రతిపాదించాయి. ఐతే ఈ విషయాన్ని తప్పుగా అర్ధం చేసుకొని 12 సార్లు గాంధీ నామినేట్ అయినట్టు షేర్ చేస్తున్నారు, కానీ గాంధీ నామినేట్ అయ్యింది ఐదు సార్లు మాత్రమే.

అలాగే దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా 1950-61 కాలంలో మొత్తంగా ఏడు సార్లు నోబెల్ శాంతి పురస్కారం కోసం నామినేట్  అయ్యారు.  ఈ ఏడు సంవత్సరాలలో మొత్తం 13 నామినేషన్స్ నెహ్రూను ప్రతిపాదించాయి. నెహ్రు విషయంలో కూడా నామినేషన్స్ మరియు నామినేట్ మధ్య పొరపాటు జరిగింది. 

గాంధీకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడానికి గల కారణాలు :

గాంధీకి శాంతి బహుమతి ఎందుకు దక్కలేదో నోబెల్ ఫౌండేషన్ కచ్చితంగా వెల్లడించలేదు కానీ ఓ వ్యాసంలో ఈ కారణాలను సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ వ్యాసంలో వెల్లడించిన పలు కారణాలను కింద చూద్దాం.

  • ప్రపంచ శాంతికి చేసిన కృషికి గుర్తుగా ఇచ్చే శాంతి పురస్కారాన్ని గాంధీకి ఇవ్వకపోవడానికి ఆయనలో అధిక శాతంలో ఉన్న జాతీయవాదం, దేశభక్తి గుణాలు కారణమని తెలిపింది.
  • 1960 వరకూ నోబెల్ పీస్ ప్రైజ్ కేవలం యూరోపియన్లు, అమెరిన్లకు మాత్రమే ఇచ్చేవారు.
  • 1947లో గాంధీని నామినేట్ చేసినా దేశ విభజన, హింస లాంటి పరిణామాల నేపథ్యంలో పురస్కారం అందజేయలేదు.
  • గాంధీ కేవలం భారతీయుల కోసమే పోరాడారని, అంతర్జాతీయ శాంతి కోసం కృషి చేయలేదని అప్పటి నోబెల్ కమిటీ భావించింది.
  • చివరిగా 1948లో గాంధీ ఈ బహుమతికి నామినేట్ అయ్యారు. ఐతే 1948లో నోబెల్ శాంతి పురస్కారం నామినేషన్‌ చివరి తేదీకి రెండు రోజుల ముందు గాంధీ హత్య జరిగింది. ఆ సమయానికే నోబెల్ కమిటీకి గాంధీ తరఫున ఐదు సిఫార్సులు అందాయి. ఆ సమయంలో మరణానంతరం ఎవరికీ నోబెల్ పురస్కారం ఇచ్చేవారు కాదు. ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో నోబెల్ పురస్కారం మరణానంతరం కూడా ఇవ్వవచ్చు. ఈ క్రమంలోనే గాంధీజీ మరణం తర్వాత నోబెల్ శాంతి పురస్కారం ఇద్దామని భావించారు. అప్పుడు బహుమతికి సంబంధించిన నగదు ఎవరికి అందించాలో అన్న విషయంలో కమిటీకి మరో ప్రశ్న ఎదురైంది.  ఎందుకంటే గాంధీకి అప్పుడు ఎలాంటి ట్రస్టుగానీ, సంఘం గానీ లేదు. ఆయనకంటూ ఎలాంటి ఆస్తులు కూడా లేవు. దీనికి సంబంధించి ఆయన ఎలాంటి వీలునామా కూడా రాయలేదు. ఈ విషయంలో ఎలాంటి గందరగోళంలో పడడం నోబెల్ కమిటీకి ఇష్టం లేని కారణంగా ఆ సంవత్సరం గాంధీకి నోబెల్ బహుమతి అందించలేదు.  ఐతే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఏడాది నోబెల్ బహుమతిని ఎవరకీ ఇవ్వలేదు. ఈ పురస్కారం అందుకోవడానికి జీవించి ఉన్న వారిలో అర్హులు ఎవరూ లేరని నోబెల్ కమిటీ తెలిపింది.

అంతే కాదు, నోబెల్ కమిటీ తరువాతి సభ్యులు గాంధీకి అవార్డు ఇవ్వకపోవడం గురుంచి బహిరంగంగా విచారం కూడా వ్యక్తం చేశారు. 1989లో దలైలామాకు నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేసినప్పుడు, కమిటీ ఛైర్మన్, ఇది “మహాత్మా గాంధీ జ్ఞాపకానికి పాక్షికంగా నివాళి” అని అన్నారు.

చివరగా, నోబెల్ శాంతి బహుమతికి గాంధీ నామినేట్ అయ్యింది ఐదు సార్లు మాత్రమే, పన్నెండు సార్లు కాదు. కమిటీ సభ్యులు గాంధీకి అవార్డు ఇవ్వకపోవడం గురుంచి బహిరంగంగా విచారం కూడా వ్యక్తం చేశారు

Share.

About Author

Comments are closed.

scroll