Fake News, Telugu
 

ATMలో రివర్స్ ఆర్డర్‌లో PINని నమోదు చేస్తే సమీప పోలీసు స్టేషన్‌కు అలర్ట్ మెసేజ్ పంపబడదు

0

“మిమ్మల్ని ఎప్పుడైనా దొంగలు బలవంతంగా ATM నుండి మనీ తియ్యమంటే, మీరు గోడవపడకుండా ప్రశాంతంగా, మీ ATM PIN ను రివర్స్ లో ఎంటర్ చెయ్యండి, అప్పుడు మనీ ATM మెషీన్ SLOT మధ్యలో ఆగిపోతుంది మరియు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు అలర్ట్ చేస్తుంది ప్రతీ ఎటిఎం మెషీన్ లో ఈ సదుపాయం ఉంది”  అని చెప్తూ ఉన్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ). అలాగే, ఈ వార్తలో ఎంత నిజముందో నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్‌ టిప్‌లైన్‌కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ATMలో మీ PINని రివర్స్ ఆర్డర్‌లో నమోదు చేస్తే, సమీప పోలీస్ స్టేషన్‌కు అలర్ట్ మెసేజ్ పంపబడుతుంది, ప్రతీ ATM మెషీన్‌లో ఈ సదుపాయం ఉంది.  

ఫాక్ట్(నిజం): ATMలో రివర్స్ ఆర్డర్‌లో PINని నమోదు చేస్తే సమీప పోలీసు స్టేషన్‌కు అలర్ట్ మెసేజ్ పంపబడదు. ATMలలో ఉపయోగించడానికి ఇటువంటి అత్యవసర సాంకేతికతలు ఉన్నప్పటికీ, ఆచరణాత్మక సమస్యలు కారణంగా ఇలాంటి సాంకేతికత ప్రపంచంలో ఎక్కడా అమలు చేయబడలేదు. ఇలాంటి సాంకేతికత ప్రపంచంలో ఎక్కడ వినియోగంలో లేదని స్పష్టం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు వార్త సంస్థలు మరియు ఫాక్ట్-చెక్ సంస్థలు కథనాలు ప్రచురించాయి. అలాగే ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు సహా పలు దేశాల పోలీసులు కూడా స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ATMలో మీ PINని రివర్స్ ఆర్డర్‌లో నమోదు చేస్తే, సమీప పోలీస్ స్టేషన్‌కు అలర్ట్ మెసేజ్ పంపబడుతుంది, కావున ఎప్పుడైనా దొంగలు బలవంతంగా ATM నుండి మనీ తియ్యమంటే, మీ ATM PIN ను రివర్స్ లో ఎంటర్ చెయ్యండి అనే వాదన సుమారు దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సోషల్ మీడియాలో ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయబడుతోంది (ఇక్కడ, ఇక్కడ).

అయితే ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు వార్త సంస్థలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ)  మరియు ఫాక్ట్-చెక్ సంస్థలు కథనాలు ప్రచురించాయి (ఇక్కడ).

ఇదే వాదనతో కూడిన పోస్టులపై 2014లో ఆస్ట్రేలియాకు చెందిన హాబ్సన్స్ బే పోలీసులు స్పందిస్తూ ఇలాంటి సాంకేతికత ఏది ఆస్ట్రేలియాలో వినియోగంలో లేదని ఆస్ట్రేలియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ (ABA) స్పష్టం చేసింది అని పేర్కొన్నారు. అలాగే, 2015లో అమెరికాకు చెందిన న్యూ హాంప్‌షైర్ పోలీసులు స్పందిస్తూ ఇలాంటి సాంకేతికత ఏది అమెరికాలో వినియోగంలో లేదని స్పష్టం చేసింది. భారతదేశంలో కూడా ఇలాంటి సాంకేతికత లేదని 2016లో ABP పబ్లిష్ చేసిన కథనం స్పష్టం చేస్తుంది.  

2010లో ఫెడరల్ ట్రేడ్ కమీషన్ విడుదల చేసిన ఒక నివేదిక  ప్రకారం,  ATMలో ఎమర్జెన్సీ PIN సాంకేతికతలు ఎన్నడూ అమలు చేయబడలేదని తెలిపింది. జోసెఫ్ జింగర్ అనే న్యాయవాది 1998లో “సేఫ్టీపిన్” అనే అదే విధమైన భద్రతా వ్యవస్థకు పేటెంట్ పొందారు. అతను రూపొందించిన రివర్స్-పిన్ సిస్టమ్ లేదా రివర్స్డ్ పిన్ ఎంట్రీల ATM నుండి పోలీసులకు డిస్ట్రెస్ సిగ్నల్ పంపుతుంది అని పేర్కొంది. అయితే ఈ సాంకేతికతలు ఎన్నడూ  ATMలలో అమలు చేయబడలేదని తెలిపింది.

ATMలలో ఉపయోగించడానికి ఇటువంటి అత్యవసర సాంకేతికత ఉన్నప్పటికీ, ఆచరణాత్మక సమస్యలు కారణంగా ఇలాంటి సాంకేతికత ప్రపంచంలో ఎక్కడా అమలు చేయబడలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిలో కొన్ని: 

  1. ‘2112’ లేదా ‘5555’ వంటి పాలిండ్రోమిక్ నంబర్ లను ATM పిన్‌లగా ఉపయోగించడం వీలు కాదు.
  2. ATM వద్ద దుండగులు డబ్బు ఇవ్వమని బెదిరిస్తే, ఒత్తిడితో కూడిన ఈ పరిస్థితిలో ATM పిన్‌ని వెనుక నుండి గుర్తుంచుకోవడం కూడా కష్టంగా ఉండవచ్చు. 
  3. మీరు మీ ATM పిన్‌ను రివర్స్‌లో నమోదు చేయగలిగినప్పటికీ, ATM పోలీసులకు అలర్ట్ మెసేజ్ పంపిన, వారు సహాయం అందించే లోగా దుండగులు నగదును తీసుకొని పారిపోయే అవకాశం ఉంటుంది.    

చివరగా, ATMలో రివర్స్ ఆర్డర్‌లో PINని నమోదు చేస్తే సమీప పోలీసు స్టేషన్‌కు అలర్ట్ మెసేజ్ పంపబడదు.

Share.

About Author

Comments are closed.

scroll