పాకిస్తాన్‌లో అతి పెద్ద ప్రావిన్స్ అయిన బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడుతున్నట్లు 09 మే 2025న బలోచిస్తాన్ వేర్పాటువాద ప్రతినిధి, రచయిత, జర్నలిస్ట్, మానవహక్కుల కార్యకర్తగా చెప్పుకున్న మీర్ యార్ బలోచ్ Xలో పోస్టు చేశారు. బలోచిస్తాన్‌ని స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితి, భారత్, ఇతర దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. బలోచిస్తాన్‌లో ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం కూలిపోతుందని, ఆ స్థానంలో స్వతంత్ర బలూచిస్తాన్ యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు. అయితే, బలోచిస్తాన్‌ని స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ భారత్, ఐక్యరాజ్య సమితి ఎక్కడా అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఈ నేపథ్యంలో, స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలోచిస్తాన్‌లో 25 ఏళ్ల హిందూ మహిళ కశిష్ చౌదరిని అసిస్టెంట్ కమీషనర్‌గా నూతన ప్రభుత్వం నియమించిందని చెప్తూ ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలోచిస్తాన్‌లో 25 ఏళ్ల హిందూ మహిళ కశిష్ చౌదరిని అసిస్టెంట్ కమీషనర్‌గా నూతన ప్రభుత్వం నియమించింది.
ఫాక్ట్: బలోచిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తించబడలేదు. బలోచిస్తాన్‌లో వేర్పాటు వాదుల కొత్త ప్రభుత్వం ఏర్పడినట్లు కూడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. మార్చి 2024 నుంచి బలోచిస్తాన్ ప్రావిన్స్ లో అధికారంలో ఉన్న PPP, PML(N) కూటమి ప్రభుత్వమే హిందూ మహిళ కశిష్ చౌదరిని అసిస్టెంట్ కమీషనర్‌గా నియమించింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వైరల్ పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోని 13 మే 2025న బలోచిస్తాన్ ముఖ్యమంత్రి కార్యాలయం యొక్క అధికారిక X హ్యాండిల్ పోస్టు (ఇక్కడ & ఇక్కడ) చేసినట్లు గుర్తించాం. అలాగే, భారత మీడియా సంస్థలు (ఇక్కడ & ఇక్కడ) కూడా ఇదే ఫోటోతో వార్తా కథనాలను ప్రచురించాయి. ఈ కథనాల ప్రకారం, బలోచిస్తాన్ ప్రావిన్స్ కు చెందిన 25 ఏళ్ల పాకిస్తానీ హిందూ మహిళ కశిష్ చౌదరి బలోచిస్తాన్ యొక్క మొట్టమొదటి హిందూ మహిళా అసిస్టెంట్ కమీషనర్‌గా నియమించబడ్డారు. బలోచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత పొందడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా, 12 మే 2025న కశిష్ చౌదరి తన తండ్రితో కలిసి బలోచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తిని కలిశారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రస్తుత బలోచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి (PPP) చెందిన నేత. మార్చి 2024లో జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML(N)) మద్దతుతో సర్ఫరాజ్ బుగ్తి బలోచిస్తాన్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బలోచిస్తాన్ అసెంబ్లీలో ప్రస్తుతం PPP, PML(N) మరియు ఇతర పార్టీలు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి. అలాగే, జాతీయ స్థాయిలో కూడా ఈ రెండు పార్టీలు అధికార కూటమిలో ఉన్నాయి. దీన్ని బట్టి, కశిష్ చౌదరిని అసిస్టెంట్ కమీషనర్‌గా నియమించింది కూడా 2024 నుంచి బలోచిస్తాన్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమే అని నిర్ధారించవచ్చు.

అదే విధంగా, బలోచిస్తాన్‌ని స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ భారత్, ఐక్యరాజ్య సమితి ఎక్కడా అధికారిక ప్రకటన చెయ్యలేదు. అలాగే, బలోచిస్తాన్‌లో వేర్పాటువాదుల కొత్త ప్రభుత్వం ఏర్పడినట్లు కూడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
చివరిగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న పాకిస్తానీ ప్రభుత్వమే పాకిస్తానీ హిందూ మహిళ కశిష్ చౌదరిని బలోచిస్తాన్‌లో అసిస్టెంట్ కమీషనర్‌గా నియమించింది.