Fake News, Telugu
 

2025 మహాకుంభమేళాలో అనుమానాస్పదంగా పట్టుబడ్డ అయూబ్ ఆలీ ఉగ్రవాది కాదని తమ దర్యాప్తులో తేలిందని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు

0

“2025 మహాకుంభమేళాలో అయూబ్ ఖాన్ అనే ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు, అతను సాధువుగా వేషం వేసుకొని వచ్చి మన సాధువులతో కలిసిపోయాడు” అంటూ ఓ సాధువును ఇద్దరు పోలీసులు నీళ్లలో పట్టుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2025 మహాకుంభ మేళాలో సాధువు వేషంలో ఉన్న అయూబ్ ఖాన్ అనే ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన ఫోటో.

ఫాక్ట్(నిజం): 14 జనవరి 2025 తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో, మహాకుంభమేళాలోని యతి నర్సింహానంద శిబిరం సమీపంలో ఆయుబ్ ఆలీ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా, నర్సింహానంద శిష్యులు కొందరు అతన్ని పట్టుకుని ప్రశ్నించారు. ఆ సమయంలో తన పేరు ఆయుష్ అని అతను చెప్పాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి అక్కడి సాధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో తన అసలు పేరు అయూబ్ ఆలీ అని తేలింది. అయితే, అయూబ్ ఆలీ ఉగ్రవాది కాదని పోలీసుల విచారణలో తేలిందని, అతను పట్టుబడినప్పుడు సాధువు వేషంలో లేడని అతని అదుపులోకి తీసుకున్న మహాకుంభమేళా అఖ్రా పోలీస్ స్టేషన్ ఇన్-చార్జ్ భాస్కర్ మిశ్రా మాతో (FACTLY) మాట్లాడుతూ స్పష్టం చేశారు. అలాగే ఈ వైరల్ ఫోటో AI ఉపయోగించి రూపొందించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా ఈ వైరల్ పోస్టులో చెప్పినట్లుగా ఇటీవల 2025 కుంభమేళాలో సాధువు వేషంలో ఉన్న అయూబ్ ఖాన్ అనే ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, కుంభమేళాలో అయూబ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు పలు వార్తా కథనాలను మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 14 జనవరి 2025 తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో, మహాకుంభమేళాలోని యతి నర్సింహానంద శిబిరం సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా, నర్సింహానంద శిష్యులు కొందరు అతన్ని పట్టుకుని ప్రశ్నించారు. మొదట అతను యతి నర్సింహానంద కలవడానికి వచ్చాను అని, అతని పేరు ఆయుష్ అని చెప్పాడు. అయితే అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి అక్కడి సాధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో అతని అసలు పేరు అయూబ్ అని, అతడు ముస్లిం అని తేలింది.

హిందుస్థాన్, ఇండియా టీవీ ప్రచురించిన కథనాల ప్రకారం, అయూబ్ అలీ ఉత్తరప్రదేశ్ ఇటాహ్‌లోని అలీగంజ్‌కు చెందినవాడు, అతని తండ్రి పేరు షకీర్ అలీ, అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదు.అలాగే ఈ కథనాల ప్రకారం, అఖారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ భాస్కర్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, అయూబ్ అలీ ఇటాహ్‌కు చెందినవాడని, అతన్ని SOT మరియు STF విచారిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం, అతని అదుపులోకి తీసుకున్న మహాకుంభమేళా అఖ్రా పోలీస్ స్టేషన్ ఇన్-చార్జ్ భాస్కర్ మిశ్రాను సంప్రదించాము . ఆయన మాతో మాట్లాడుతూ “మహాకుంభ మేళాలో అనుమానస్పదంగా పట్టుబడ్డ అయూబ్ అలీ ఉగ్రవాది కాదని SOT మరియు ATS పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది, అతను ఉత్తరప్రదేశ్‌లోని ఇటాహ్‌లోని అలీగంజ్‌కు చెందినవాడు, అతని తండ్రి పేరు షకీర్ అలీ, అతనికి ఎటువంటి నేర చరిత్ర లేదు, అతను దినసరి కూలీ అని. అలాగే, పట్టుబడినప్పుడు అతను సాధువు వేషంలో లేడు” అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు.  

ఇకపోతే ఈ వైరల్ పోస్టులో షేర్ చేస్తున్న ఫోటోను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇది AI-జనరేటెడ్ ఫోటో అని అర్థమవుతుంది. తదుపరి మేము ఈ వైరల్ ఫోటోAI-జనరేటెడ్? లేదా? అని నిర్ధారించడానికి, Hive, wasitAI వంటి AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్స్ ని ఉపయోగించి ఈ వైరల్ ఫోటోను పరిశీలించగా, ఈ వైరల్ ఫోటో 99.8% AI-జనరేటెడ్ ఫోటో కావచ్చని  Hive ఫలితాన్ని ఇచ్చింది. అలాగే  wasitAI కూడా ఇది AI- జనరేటెడ్ ఫోటో అని ఫలితాన్ని ఇచ్చింది.

చివరగా, 2025 మహాకుంభమేళాలో అనుమానాస్పదంగా పట్టుబడ్డ అయూబ్ ఆలీ ఉగ్రవాది కాదని తమ దర్యాప్తులో తేలిందని, అలాగే అతను పట్టుబడినప్పుడు సాధువు వేషంలో లేడని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.

Share.

About Author

Comments are closed.