తన చెల్లెలితో ఒక ముస్లిం వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఒక హిందూ వ్యక్తి అతని తలను నరికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడుతున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేయబడుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి కొందరి మధ్య కూర్చొని అరుస్తూ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: తన చెల్లితో ఒక ముస్లిం వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఒక హిందూ వ్యక్తి అతని తలను నరికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మాట్లాడుతున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గోరఖ్‌పూర్ యూనివర్సిటీలో ‘విద్యార్థి సంఘం’ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ, అక్టోబర్ 2024లో కొందరు విద్యార్థి నాయకులు చేపట్టిన ఆందోళనల సమయంలో తీసినది. వైరల్ క్లైయిములో చెప్తున్న సంఘటన ఇటీవల జరిగినట్లు మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు దొరకలేదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకాగా, ఇటీవల తన చెల్లితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఒక హిందూ వ్యక్తి, ఒక ముస్లిం వ్యక్తి తల నరికాడు అని చెప్తూ, మాకు ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు.
ఇక, వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో గురించి అక్టోబర్ 2024లో క్రితం ‘దైనిక్ భాస్కర్’ ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు దొరికింది. ఈ కథనం ప్రకారం ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గోరఖ్‌పూర్ యూనివర్సిటీలో తీసిన వీడియో ఇది.

తమ యూనివర్సిటీలో ‘విద్యార్థి సంఘం’ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ విద్యార్థి నాయకులు 17 అక్టోబర్ 2024న, ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శాంతను రస్తోగిని చుట్టుముట్టారు. ఆ సంఘటనకు చెందిన వీడియోని షేర్ చేస్తూ ఒక కల్పిత కథతో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని ఈ వార్తా కథనం ద్వారా మాకు అర్థం అయ్యింది. ఈ సంఘటనకు ముందు ఒక వారం రోజులుగా విద్యార్థి నాయకులు ఎన్నికల కోసం డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారని వార్తా కథనాలు పేర్కొన్నాయి.

చివరగా, తన చెల్లితో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఒక హిందూ వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి తలని నరికేశాడని చెప్తూ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గోరఖ్‌పూర్ యూనివర్సిటీలో ‘విద్యార్థి సంఘం’ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ, కొందరు విద్యార్థి నాయకులు చేపట్టిన ఆందోళనల సమయంలో తీసిన వీడియోని తప్పుగా షేర్ చేస్తున్నారు.