ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకునే దిశగా ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి, 13 జూన్ 2025న, ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరుతో ఇరాన్ అణు, సైనిక ప్రదేశాలు లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు, డ్రోన్ దాడులను చేసింది. ఈ దాడుల్లో పలువురు అగ్రశ్రేణి ఇరాన్ సైనిక అధికారులు, అణు శాస్త్రవేత్తలు హతమయ్యారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’కు కౌంటర్‌గా ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్ -3’ని ఇరాన్ ప్రారంభించింది. ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలు లక్ష్యంగా వందలాది బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది (ఇక్కడ, ఇక్కడ). ఇరాన్‌లోని ఫోర్దో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలపై అమెరికా బాంబు దాడులు చేసింది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). రోజురోజుకు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, “అమెరికా & ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి ఇరాన్ ఆయుధాలు, మిసైళ్లు, రాకెట్లను తరలిస్తున్న దృశ్యాలు” అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో, రాకెట్‌ను పోలిన భారీ వస్తువును భారీ ట్రక్కుపై రవాణా చేయడాన్ని మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి ఇరాన్ ఆయుధాలను తరలిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ వైరల్ వీడియోకు ప్రస్తుతం జూన్ 2025లో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో, 13 జూన్ 2025న, ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించడానికి కంటే ముందు నుండి ఇంటర్నెట్లో ఉన్నది. ఈ వీడియో 2018 నుండి ఇంటర్నెట్లో ఉంది. ఈ వీడియో కజకిస్తాన్ నుండి ఉజ్బెకిస్తాన్‌లోని ఒక సహజ వాయువు ప్లాంట్‌కు స్లర్రీ హాప్పర్ అనే పరికరాన్ని రవాణా చేయడాన్ని చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియో యొక్క అధిక నిడివి గల వీడియో యూట్యూబ్‌లో లభించింది. ఈ వీడియోను ‘HEAVY TRANSPORT (O.Y)’ అనే యూట్యూబ్ ఛానెల్ 13 డిసెంబర్ 2018న షేర్ చేసింది. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వైరల్ వీడియో కజకిస్తాన్ నుండి ఉజ్బెకిస్తాన్‌లోని సహజ గ్యాస్ స్టేషన్‌కు స్లర్రీ హాప్పర్ (Slurry hopper) అనే పరికరాన్ని తరలిస్తున్న దృశ్యాలను చూపిస్తుంది.
ఇదే వైరల్ వీడియో యొక్క అధిక నిడివి గల వీడియో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ‘DALNOBOI_UZB’ అనే యూజర్ జనవరి 2021లోయూట్యూబ్లో షేర్ చేశారు. ఈ వీడియో వివరణలో, ట్రక్కులోని పరికరాన్ని కాండిమ్ గ్యాస్ ప్లాంట్‌కు (Kandym Gas plant) తరిలిస్తున్నట్లు పేర్కొనబడింది. కాండిమ్ గ్యాస్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ (KGPC)ను కాండిమ్ గ్యాస్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు, ఇది ఉజ్బెకిస్తాన్‌లోని బుఖారా ప్రాంతంలో ఉన్న ఒక సహజ వాయువు ప్రాసెసింగ్ ప్లాంట్ (ఇక్కడ, ఇక్కడ,& ఇక్కడ).
వైరల్ వీడియోను మనం జాగ్రతగా పరిశీలిస్తే, ట్రైలర్‌ను లాగుతున్న వాహనంపై ‘Çaba Misnak’ అని రాసి ఉండటాన్ని మనం గమనించవచ్చు. Çaba & Misnak అనేది భారీ పరికరాలను రవాణా చేసే టర్కిష్ లాజిస్టిక్స్ కంపెనీ (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

ఇంతకుముందు, 2022లో ఇదే వైరల్ వీడియో రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలకు సంబంధించినదని చెబుతూ వైరల్ కాగా, ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం AFP ఫ్యాక్ట్-చెక్ సంస్థ Çaba & Misnakని సంప్రదించగా, ఈ వీడియోలో కనిపిస్తున్న పరికరం స్లర్రీ హాప్పర్ అని, అది ఉజ్బెకిస్తాన్‌లోని చమురు శుద్ధి కర్మాగారానికి సంబంధించినదని Çaba & Misnak 2022లో AFPకి స్పష్టం చేసింది.
అలాగే 2023లో, టర్కీకి చెందిన ఫాక్ట్-చెక్ సంస్థ ‘Teyit’తో కూడా Çaba & Misnak, కజకిస్తాన్ నుండి ఉజ్బెకిస్తాన్‌లోని సహజ వాయువు ప్లాంట్‌కు స్లర్రీ హాప్పర్/బాయిలర్‌ను రవాణా చేస్తున్న దృశ్యాలను వైరల్ వీడియో చూపిస్తుందని స్పష్టం చేసింది. దీన్ని బట్టి ఈ వీడియోకు ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఎటువంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.
చివరగా, ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి ఇరాన్ మిస్సైల్‌ను తరలిస్తున్న దృశ్యాలంటూ ఉజ్బెకిస్తాన్‌లోని ఓ సహజ వాయువు ప్లాంట్ కోసం పరికరాల రవాణాకు సంబంధించిన పాత వీడియోను షేర్ చేస్తున్నారు.