13 మే 2024న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి, ఈ ఎన్నికల సందర్బంగా ఏపీలో పలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి, మాచర్ల నియోజికవర్గం పరిధిలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ప్రస్తుత మాచర్ల MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం (EVM) ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు, ఆయన పై తగిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి(CEO) ఎంకే మీనా తెలిపారు. ఈ నేపథ్యంలోనే, 13 మే 2024న జరిగిన 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్బంగా గుంతకల్లు టీడీపీ – జనసేన ఉమ్మడి MLA అభ్యర్థి మధుసూదన్ గుప్తా కూడా EVM ధ్వంసం చేశారు అని చెప్తూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). దీనికి మద్దతుగా ఓ వ్యక్తి EVM ధ్వంసం చేస్తున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్బంగా గుంతకల్లు టీడీపీ – జనసేన ఉమ్మడి MLA అభ్యర్థి మధుసూదన్ గుప్తా EVM ధ్వంసం చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుంతకల్లు నియోజకవర్గం జనసేన MLA అభ్యర్థి మధుసూదన్ గుప్తా అనంతపురం గుత్తి పట్టణంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించినవి. ఇటీవల ముగిసిన 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్బంగా గుంతకల్లు నియోజికవర్గం పరిధిలో EVM ధ్వంసం చేసిన సంఘటన ఏది చోటు చేసుకోలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ పోస్టులో తెలిపినట్టుగా,2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్బంగా గుంతకల్లు నియోజికవర్గం పరిధిలో ఇలాంటి ఏదైనా EVM ధ్వంసం చేసిన సంఘటన చోటు చేసుకుందా?అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, ఇలాంటి సంఘటన ఏది గుంతకల్లు నియోజికవర్గం పరిధిలో జరిగినట్లు ఎటువంటి రిపోర్ట్స్ మాకు లభించలేదు.
అంతే కాదు, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుంతకల్లు నియోజికవర్గం నుండి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్ధిగా టీడీపీ నుండి గుమ్మునూరు జయరాం పోటీ చేస్తున్నట్లు తెలసింది. అలాగే, ఈ ఎన్నికల్లో గుంతకల్లు నియోజికవర్గం నుండి మధుసూదన్ గుప్తా పేరుతో ఎవరు పోటిలో లేరని తెలిసింది.

తదుపరి మేము ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం తెలుసుకునేందుకు వీడియో యొక్క కీఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 11 ఏప్రిల్ 2019లో ‘ANI’ న్యూస్ పబ్లిష్ చేసిన వార్త కథనం ఒకటి మాకు లభించింది. ఈ కథనం ప్రకారం, 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్బంగా జనసేన MLA అభ్యర్థి మధుసూదన్ గుప్తా అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలోని ఒక పోలింగ్ కేంద్రంలో EVM ధ్వంసం చేసారు.
ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తున్న పలు వార్త కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.ఈ కథనాల ప్రకారం, అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం జనసేన అభ్యర్థి మదుసూదన్ గుప్తా గుత్తిలోని 183 నంబర్ పోలింగ్ బూత్‌లో ఓటేసేందుకు వెళ్లారని, పోలింగ్ కేంద్రంలో అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల పేర్లు సరిగా రాయలేదని అధికారులపై ఆగ్రహం వక్తం చేస్తూ ఆయన ఈవీఎం పగులగొట్టారు అని తెలిసింది .ఈ ఘటన తరువాత వెంటనే గుంతకల్లు జనసేన MLA అభ్యర్థి మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుంతకల్లు నియోజకవర్గం జనసేన MLA అభ్యర్థి మధుసూదన్ గుప్తా గుత్తి పట్టణంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించినవిగా మనం నిర్థారించవచ్చు.

చివరగా, ఇటీవల జరిగిన 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గుంతకల్లు టీడీపీ- జనసేన ఉమ్మడి MLA అభ్యర్థి EVM ధ్వంసం చేసారంటూ ఒక పాత 2019 వీడియోను షేర్ చేస్తున్నారు.