‘కల్వకుంట్ల కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంబరంలో BRS కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు నిప్పంటించారు’ అని చెప్తూ, ఒక భవనం పైన మంటలు రేగుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి బాణా సంచా డబ్బాను భవనం ఎదురుగా ఉన్న గేట్ బయటకు కర్రతో తోసివేయడం మనం చూడవచ్చు. అలాగే, ఒక పోలీస్ అధికారి, వాకీ టాకీలో మాట్లాడుతూ ‘సర్, టీఆర్ఎస్ భవన్ దగ్గర కొంచం ఫైర్ అయ్యింది సర్…’అని చెప్పడం మనం వినొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే. కవితను ఈ పార్టీ నుండి 2 సెప్టెంబర్ 2025న సస్పెండ్ చేసిన నేపథ్యంలో, ఈ వీడియో షేర్ చేయబడుతోంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: 2 సెప్టెంబర్ 2025న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే. కవితను ఆ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు చేపట్టిన సంబరాల్లో తెలంగాణ భవన్‌కు నిప్పంటించినప్పుడు తీసిన వీడియో.
ఫ్యాక్ట్: ఇది మార్చ్ 2021లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ‘తెలంగాణ భవన్’లో జరిగిన ఒక అగ్ని ప్రమాదానికి చెందిన వీడియో, సెప్టెంబర్ 2025 నాటిది కాదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతుకగా, కే. కవితను 2 సెప్టెంబర్ 2025న బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత, వైరల్ క్లెయిములో చెప్తున్నట్లుగా, తెలంగాణ భవన్ ఎదుట జరిగిన సంబరాల్లో ఆ భవనానికి పార్టీ కార్యకర్తలు నిప్పంటించారని చెప్తూ మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు దొరకలేదు.
ఇక వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం, అందులోని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ వీడియో మార్చి 2021 నాటిది అని మాకు తెలిసింది. ‘Siasat Daily’ వారు 20 మార్చ్ 2021లో తమ యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో రిపోర్టులో ఈ వీడియో క్లిప్ ఉంది.

ఆ రిపోర్ట్ ప్రకారం బీఆర్ఎస్(అప్పట్లో టీఆర్ఎస్) పార్టీ యొక్క ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ దగ్గర జరిగిన సంబరాల సందర్భంగా అక్కడ జరిగిన ఒక అగ్ని ప్రమాదాన్ని ఈ వీడియో చూపిస్తుంది. ఈ సంఘటనపై వచ్చిన మరిన్ని వార్తా కథనాలను మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఈ కథనాల ప్రకారం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ నుంచి సురభి వాణీదేవి గెలిచిన సందర్భంగా, ఆ పార్టీ కార్యకర్తలు చేసుకున్న సంబరాల్లో తెలంగాణ భవన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ‘కార్యకర్తలు సంబరాల్లో అత్యుత్సాహం ప్రదర్శించి బాణసంచా కాల్చారు. బాణాసంచా నిప్పు రవ్వలు కాస్తా పైకప్పుపై పడ్డాయి. వెంటనే మంటలు అంటుకున్నాయి. తెలంగాణ భవన్‌లో మంటలు ఎగిసి పడుతుండడంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు’ అని ఈ సంఘటనన గురించి మార్చి 2021లో సమయం తెలుగు ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది.

చివరగా, మార్చి 2021లో తెలంగాణ భవన్‌లో జరిగిన ఒక అగ్ని ప్రమాదం వీడియోని సెప్టెంబర్ 2025లో కల్వకుంట్ల కవితను BRS పార్టీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు చేపట్టిన సంబరాల్లో తెలంగాణ భవన్‌కు నిప్పంటించారని చెప్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు.