Fake News, Telugu
 

పశ్చిమ బెంగాల్‌లోకి రోహింగ్యాలు లారీలలో తరలి వెళ్తున్న వీడియో అని భోపాల్‌లో తీసిన ఒక పాత వీడియోని షేర్ చేస్తున్నారు

0

వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్లోని చాలా చోట్ల నిరసనలు జరిగాయి. ముర్షిదాబాద్‌ జిల్లాలో ఈ ఆందోళనులు హింసాత్మకంగా మారి, గొడవలు, అల్లర్లు కూడా జరిగాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). వార్త కథనాల ప్రకారం( ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఈ గొడవల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో చందన్ దాస్, హరగోబింద్ దాస్ అనే ఇద్దరు హిందువులు ఒక మూక దాడిలో మరణించగా, ఒక ముస్లిం వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ముర్షిదాబాద్‌ జిల్లాలో జరుగుతున్న ఈ హింసను తప్పించుకోవడానికి వందలాది హిందువులు తమ ఇళ్లను వదిలి, ఆశ్రయం పొందడానికి మాల్డా నగరానికి చేరుకున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).  పరస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర బలగాలని మోహరించాలని కలకత్తా హైకోర్టు  ఆదేశించింది (ఇక్కడ, ఇక్కడ). ఈ అల్లర్లకు సంబంధించి సుమారు 150 పైగా వ్యక్తులు అరెస్ట్ అయ్యారు (ఇక్కడ, ఇక్కడ). 

ఈ నేపథ్యంలో, ‘బెంగాల్ రాష్ట్రములోకి లారీలో తరలి వెళ్తున్న భారత దేశంలో అక్రమ చొరబాటు దారులు రోహింగ్యలు.’ అని క్లెయిమ్ చేస్తూ, పెద్ద సంఖ్యలో కొందరు ముస్లిం వ్యక్తులు ట్రక్కులలో ప్రయాణిస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముర్షిదాబాద్‌లో ఏప్రిల్ 2025లో జరిగిన మతపరమైన హింస నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోకి లారీలలో తరలి వెళ్తున్న రోహింగ్యాల వీడియో

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోకు ముర్షిదాబాద్‌లో ఇటీవల జరిగిన మతపరమైన హింసకు ఎటువంటి సంబంధం లేదు. ఇది నిజానికి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుండి 14 కి.మీ దూరంలో ఉన్న ఘాసిపురాలో 29 నవంబర్ 2024 నుంచి 2 డిసెంబర్ 2024 వరకు జరిగిన ఇస్లామిక్ సమావేశానికి ముస్లింలు వెళుతున్నప్పుడు తీసిన వీడియో. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

ముందుగా, వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, అందులోని కొన్ని ఫ్రేమ్‌లను ఉపయోగించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేశాము. ఈ సెర్చ్ ద్వారా మాకు 26 డిసెంబర్ 2024న YouTubeలో అప్‌లోడ్ చేయబడిన ఒక వీడియో లభించింది, ఇందులో వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలు ఉన్నాయి.

దీని బట్టి, ఈ వీడియో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఇటీవల (ఏప్రిల్ 2025లో) జరిగిన మత హింసకు సంబంధం లేదు అని మనకు స్పష్టం అవుతుంది.  ఈ వీడియోలో, ‘@Abid.sheik.315’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా యొక్క వాటర్‌మార్క్‌ను మనం స్పష్టంగా చూడవచ్చు. 

దీన్ని క్లూగా తీసుకొని ఇంటర్నెట్లో వెతకగా, ‘@Abid.sheik.315’ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వైరల్ వీడియో మాకు లభించింది(ఆర్కైవ్ లింక్) దీన్ని 3 డిసెంబర్ 2024న అబీద్ పోస్ట్ చేశారు.

మేము ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీని పరిశీలించగా, పెద్ద సంఖ్యలో స్కల్ క్యాప్‌లు(టోపీలు) ధరించి, ట్రక్కులలో ప్రయాణిస్తున్న వ్యక్తులను చూపించే అనేక ఇతర వీడియోలు మాకు కనిపించాయి. ఈ వీడియోలలో ఒకటి (ఆర్కైవ్ లింక్) మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో తీసినది అని ఉంది. అలాగే ‘29.30.1.2. 2024’ సంఖ్యలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి (బహుశా ఇది తేదీలను సూచిస్తుంది).

దీన్ని ఆధారంగా తీసుకొని, మేము తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఇస్లామిక్ సంస్థ తబ్లిఘి జమాత్ నిర్వహించిన 77వ ఆల్మీ తబ్లిఘి ఇజ్తేమా అనే ఇస్లాం మత సమావేశం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి దాదాపు 14 కి.మీ దూరంలో ఉన్న ఘాసిపురాలో 29 నవంబర్ 2024 నుంచి 2 డిసెంబర్ 2024 వరకు (ఇక్కడ, ఇక్కడ) జరిగిందని కనుగొన్నాము.

తర్వాత, వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రదేశాన్ని గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించి మేము కనుగొన్నాము. ఈ ప్రదేశం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని జెపి నగర్‌లోని గణేష్ మందిర్, చోళ నాకా సమీపంలో ఉంది. వైరల్ వీడియో, గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న ఈ ప్రదేశానికి మధ్య పోలికను మీరు ఈ క్రింది కొల్లాజ్‌లో చూడవచ్చు.

వీటన్నిటి ఆదరంగా, వైరల్ వీడియోలోని దృశ్యాలు  29 నవంబర్ 2024 నుండి 2 డిసెంబర్ 2024 వరకు భోపాల్‌లో తబ్లిగీ జమాత్ నిర్వహించిన 77వ ఆల్మీ తబ్లిగీ ఇజ్తేమా అనే ఇస్లామిక్ సమావేశానికి ట్రక్కులలో పెద్ద సంఖ్యలో ముస్లింలు వెళ్లడాన్ని చూపిస్తుందని మనకు స్పష్టం అవుతుంది.

చివరగా, ముర్షిదాబాద్‌లో ఏప్రిల్ 2025లో జరిగిన మతపరమైన హింస నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోకి రోహింగ్యాలు లారీలలో తరలి వెళ్తున్న వీడియో అని భోపాల్‌లో తీసిన ఒక పాత వీడియోని షేర్ చేస్తున్నారు 

Share.

About Author

Comments are closed.