Fake News, Telugu
 

బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార యాత్ర’ దృశ్యాలంటూ రాజస్థాన్‌కు సంబంధించిన పాత వీడియోను షేర్ చేస్తున్నారు

0

బీహార్‌లో ఎన్నికల కమిషన్ నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను, ఓట్ల రద్దును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ నిర్వహిస్తున్నారు. 17 ఆగస్టు 2025న ప్రారంభమైన ఈ యాత్ర బీహార్‌లోని దాదాపు 20 జిల్లాల్లో 16 రోజుల పాటు 1300 కిలోమీటర్లు ప్రయాణించి, 2025 సెప్టెంబర్ 01న పాట్నాలో జరిగే ర్యాలీతో ముగియనుంది (ఇక్కడఇక్కడ). ఈ నేపథ్యంలో, బీహార్‌లో సాగుతున్న రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్న దృశ్యాలు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆగస్టు 2025లో బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార యాత్ర’కు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు ప్రస్తుతం బీహార్‌లో జరుగుతున్న రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార యాత్ర’కు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో డిసెంబర్ 2022 నుండి ఆన్‌లైన్‌లో ఉంది. వీడియోలో కనిపిస్తున్న ప్రాంతం రాజస్థాన్‌లోని దౌసా పట్టణంలోని ఆగ్రా రోడ్డు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను పలువురు సోషల్ మీడియాలో డిసెంబర్ 2022లో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియో 17 ఆగస్టు 2025న ప్రారంభమైన రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’కు ముందే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నందున, ఈ వీడియోకు బీహార్‌లో ప్రస్తుతం జరుగుతున్న ‘ఓటర్ అధికార్ యాత్ర’తో ఎటువంటి సంబంధం లేదని మనం నిర్ధారించవచ్చు.

ఈ వీడియోను 2022లో షేర్ చేస్తూ, పలువురు ఈ వీడియో డిసెంబర్ 2022లో రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’కు సంబంధించిందని పేర్కొన్నారు (ఇక్కడ & ఇక్కడ). దీని ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ 15 డిసెంబర్ 2022న రాజస్థాన్‌లోని దౌసా పట్టణం మీదుగా సాగిందని తెలిసింది. వార్తా కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), రాజస్థాన్‌లో ‘భారత్ జోడో యాత్ర’ 05 డిసెంబర్ 2022న ప్రారంభమై 20 డిసెంబర్ 2022న ముగిసింది, ఈ యాత్ర రాజస్థాన్‌లోని ఆరు జిల్లాల మీదుగా సుమారు 485 కి.మీ.లు మేర సాగింది. రాహుల్ గాంధీ అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్ పేజీ 15 డిసెంబర్ 2022న రాజస్థాన్‌లోని దౌసా పట్టణం గుండా సాగిన ‘భారత్ జోడో యాత్ర’ను ప్రత్యక్ష ప్రసారం చేసింది.

తదుపరి మేము వైరల్ వీడియోలో కనిపిస్తున్న ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్స్‌లో జియోలొకేట్ చేశాము. వీడియోలో కనిపిస్తున్న ప్రాంతం ఆగ్రా రోడ్, దౌసా, రాజస్థాన్‌గా గుర్తించాము. వైరల్ వీడియోలోని కనిపిస్తున్న దృశ్యాలను రాజస్థాన్‌లోని దౌసా పట్టణంలోని ఆగ్రా రోడ్డుతో పోల్చి చూస్తే, వైరల్ వీడియో రాజస్థాన్‌లోని దౌసా పట్టణంలోని ఆగ్రా రోడ్డులో చిత్రీకరించబడినట్లు స్పష్టమవుతుంది. అయితే, ఈ వైరల్ వీడియో ఎప్పుడు చిత్రీకరించారో మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాము. కానీ, ఈ వీడియోకు ప్రస్తుతం బీహార్‌లో జరుగుతున్న రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార యాత్ర’కు ఎటువంటి సంబంధం లేదని, ఈ వీడియో రాజస్థాన్‌కు సంబంధించిందని మేము నిర్ధారించగలము. రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార యాత్ర’కి  సంబంధించిన వీడియోలను ఇక్కడ చూడవచ్చు.

చివరగా, బీహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార యాత్ర’ దృశ్యాలంటూ రాజస్థాన్‌కు సంబంధించిన పాత వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll