Fake News, Telugu
 

ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన వ్యక్తులను చూసి పాకిస్తానీ ప్రజలు రోదిస్తున్నారని చెప్తూ ఒక సంబంధం లేని పాత వీడియోని షేర్ చేస్తున్నారు

0

22 ఏప్రిల్ 2025న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, 07 మే 2025న భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్‌’ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లోని పలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. ఈ దాడులు లష్కర్-ఎ-తోయిబా (LeT), జైష్-ఎ-మహ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల శిబిరాలపైనే జరిగాయని, పాక్ సైనిక స్థావరాలను తాకలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. పాకిస్తాన్ కూడా తమ భూభాగంపై భారత దాడి చేసినట్లు ధృవీకరించింది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). భారత సైనిక వర్గాల ప్రకారం, ఈ దాడిలో కనీసం 80 మంది ఉగ్రవాదులు మరణించారని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో ఈ దాడుల్లో కనీసం 26 మంది పాక్ పౌరులు మరణించారని, 46 మంది గాయపడ్డారని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ దళాలు సరిహద్దు వెంబండి జరిపిన కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్‌లో కనీసం తొమ్మిది మంది పౌరులు మరణించారని, 38 మంది గాయపడ్డారని రిపోర్ట్స్ పేర్కొన్నాయి. 07 మే 2025న, ఉదయం 10 గంటలకు, భారత రక్షణ మంత్రిత్వ శాఖ ‘ఆపరేషన్ సింధూర్’ గురించి మీడియాకు వివరించింది, అలాగే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పలు వీడియోలను కూడా మీడియా సమావేశంలో ప్రదర్శించింది.

ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు బోరుమని విలపిస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన తీవ్రవాదులను చూసి పాకిస్థానీలు ఏడుస్తున్న దృశ్యాలివి అని చెప్తూ ఈ వీడియోని కొందరు సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన వ్యక్తులను చూసి ఏడుస్తున్న పాకిస్తానీ ప్రజల వీడియో.  

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో 25 మార్చ్ 2025 నుంచి ఇంటర్నెట్లో ఉంది. దీనికి ఆపరేషన్ సిందూర్‌లో ఎటువంటి సంబంధం లేదు. ఇది ఆల్-జజీరా ముబాషీర్ జర్నలిస్ట్ హోస్సాం షబ్బత్‌ అంత్యక్రియలు దృశ్యాలని చూపిస్తుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ వీడియో షేది అటల్ అనే వ్యక్తి యొక్క ఇన్స్టాగ్రామ్ పేజీలో దొరికింది (ఆర్కైవ్ లింక్). ఈ వీడియోని తను 25 మార్చ్ 2025న అప్లోడ్ చేశాడు.  

షేది అటల్ ఒక ఫోటో జర్నలిస్ట్ అని, తను ఆల్-జజీరా ముబాషీర్ ఛానల్‌కి పనిచేస్తాడని రాసి ఉంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో గాజాలో తీసిన చాలా వీడియోలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఉన్నాయి.

ఈ వీడియోని తను అప్లోడ్ చేస్తూ అరబిక్ భాషలో ఒక వివరణ రాశాడు. అందులో తను హోస్సాం షబ్బత్‌ అనే జర్నలిస్ట్ పేరును ప్రస్తావించాడు. 

ఈ వీడియోతో పాటు తను 2025 మార్చ్ 24,25, 26 తేదీలలో హోస్సాం షబ్బత్‌కు చెందిన చాలా వీడియోలు (ఇక్కడ, ఇక్కడ) అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలలో హోస్సాం షబ్బత్‌ అనే జర్నలిస్ట్ మరణించాడని అతను చెప్పాడు. కొన్ని వీడియోలలో హోస్సాం యొక్క అంత్యక్రియలు/తన మృతదేహాన్ని ఊరేగించడం మనం చూడవచ్చు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

ఈ సంఘటన గురించి మరింత సమాచారం కోసం, తగిన కీవర్డ్స్ ఉపయోగించి మేము ఇంటర్నెట్లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా, హోస్సాం షబ్బత్‌ యొక్క మరణం గురించి మార్చ్ 2025లో వచ్చిన వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ వార్తా కథనాలలో దృశ్యాలు అటల్ అప్లోడ్ చేసిన వీడియోలలోని దృశ్యాలతో, వ్యక్తులతో మ్యాచ్ అవుతున్నాయి. 

కథనాల ప్రకారం హోస్సాం షబ్బత్‌ ఆల్-జజీరా ముబాషీర్ జర్నలిస్ట్/ప్రతినిధి. తను పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో ఒక ఇశ్రాయెలి బాంబు దాడిలో మరణించాడు. 

చివరగా, ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన వ్యక్తులను చూసి పాకిస్తానీ ప్రజలు రోదిస్తున్నారని ఒక సంబంధం లేని పాత వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll