నేలపై పడి ఉన్న ఒక క్షిపణిపై, ఒక స్కేటర్ స్టంట్ చేస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టంట్ కారణంగా ఆ క్షిపణి పేలిపోయినట్లు ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య వివాదం జరుగుతున్న గాజాలో ఇది రికార్డ్ చేయబడిందని చెప్తూ, సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: గాజాలో నేలపై పడి ఉన్న ఒక క్షిపణిపై ఒక స్కేటర్ స్టంట్ చేసిన తర్వాత అది పేలిపోయినప్పుడు తీసిన వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది ఎడిట్ చేసిన వీడియో. అసలు వీడియోలో ఆ స్కేటర్ క్షిపణిపై పడిన తర్వాత అది పేలదు. ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం గాజా స్కేట్ టీమ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ వారు ఈ వీడియోని అప్లోడ్ చేశారు. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ క్లెయిమ్‌ను వెరిఫై చేయడానికి, వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్‌లను ఉపయోగించి మేము ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, గాజా స్కేట్ టీమ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోని 11 మే 2025న పోస్ట్ చేశారని మేము తెలుసుకున్నాము.
ఈ పోస్టులో వైరల్ వీడియో యొక్క cropped(క్రాప్ చేసిన) వెర్షన్ ఉంది. ఈ పోస్టులో ఉన్న వివరణ ప్రకారం, ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి చేసిన వీడియో ఇది. యుద్ధం సమయంలో మిగిలిపోయిన అనుమానాస్పద వస్తువులను ఎప్పుడూ తాకొద్దని, అలా చేస్తే మీరు మీ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టినవారు అవుతారని పోస్టు వివరణలో గాజా స్కేట్ టీమ్ వారు ప్రజలకు మనవి చేశారు.
ఈ పోస్ట్ ప్రజల్లో అవగాహన పెంచడానికి మాత్రమే ఉద్దేశించబడిందని ఈ వీడియోపై ఉన్న టెక్స్ట్ చెబుతోంది. ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంటు రజబ్ అల్-రీఫీకి చెందినది, అతను గాజా నగర నివాసి. రజబ్ అల్-రీఫీ 2017 నుండి స్థానిక యువతకు స్కేటింగ్ నేర్పిస్తున్నాడు. ప్రస్తుతం GoFundMe ద్వారా ఒక చిన్న స్కేట్ పార్క్ నిర్మించడానికి నిధులు సేకరిస్తున్నాడు.

ఈ వీడియో గురించి వెతుకుతున్న సమయంలో, దీని అసలు పూర్తి వెర్షన్ కూడా మాకు దొరికింది. ఈ వీడియోలో రజబ్ అల్-రీఫీ, ఎటువంటి పేలుడు సంభవించకుండా క్షిపణి ఆకారంలో ఉన్న వస్తువుపై స్టంట్ చేయడం మనం చూడవచ్చు. అలాగే, భవన శిధిలాల మధ్య ఒకే ప్రదేశంలో చాలా మంది స్కేటింగ్ చేయడం కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ఫుటేజ్‌లో ఎక్కడా కూడా ఎటువంటి పేలుడు జరగలేదు.

శిథిలాలు నిండిన వీధుల్లో స్కేటింగ్ చేస్తున్న వ్యక్తులను చూపిస్తున్న అనేక వీడియోలను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) రజబ్ అల్-రీఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
చివరగా, ఒక డిజిటల్‌గా ఎడిట్ చేసిన వీడియోను, గాజాకు చెందిన ఒక వ్యక్తి, క్షిపణిపై స్కేటింగ్ చేయడం ద్వారా పేలుడుకు కారణమయ్యాడనే తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు.