ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో 29 జనవరి 2025న ఆకాశంలో శని, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, పుష్య నక్షత్రం, నెలవంక ఒకే వరుసలో కనిపించాయని చెప్తూ ఒక ఫోటో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇలాంటి సన్నివేశం 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుందని పోస్టులో పేర్కొన్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో 29 జనవరి 2025న ఆకాశంలో శని, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, పుష్య నక్షత్రం, నెలవంక ఒకే వరుసలో కనిపించినప్పటి ఫోటో.
ఫాక్ట్: జనవరి – ఫిబ్రవరి 2025లో శని, కుజుడు, బృహస్పతి, శుక్రుడు వంటి గ్రహాలు వివిధ సందర్భాల్లో ఆకాశంలో వరుసగా కనిపిస్తున్నాయని ఆధారాలు ఉన్నాయి. కానీ వైరల్ ఫోటో ఏప్రిల్ 2022లో ఆస్ట్రేలియాలో తీసినది. దీనికి 2025 ప్రయాగరాజ్ కుంభమేళాకి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వైరల్ ఫోటోలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోని 2022లో రెడిట్ పోస్టులో (ఆర్కైవ్) షేర్ చేసినట్లు గుర్తించాం. ఈ పోస్టులో ఇచ్చిన వివరాల ప్రకారం, పశ్చిమ ఆస్ట్రేలియాలో 28 ఏప్రిల్ 2022న తీసిన ఈ ఫోటోలో శని, కుజుడు, శుక్రుడు, బృహస్పతి, నెలవంక ఉన్నాయి. ఈ ఫోటోని రెన్ థీలెన్ అనే ఫోటోగ్రాఫర్ తీసినట్లు పోస్టులో చెప్పబడింది.

పై సమాచారం ఆధారంగా రెన్ థీలెన్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలించగా, ఇదే ఫోటోను 28 ఏప్రిల్ 2022లో అప్లోడ్ (ఆర్కైవ్) చేసి ఉండడం గుర్తించాం. ఈ ఫోటోని డ్రేక్స్‌బ్రూక్ వీర్ అనే సరస్సు వద్ద తీసినట్లు పోస్టులో చెప్పబడింది.

వార్తా కథనాల ప్రకారం, 2025 జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఆకాశంలో శని, కుజుడు, బృహస్పతి, శుక్రుడు మొదలగు గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. నాసా, బీబీసీ కథనాల ప్రకారం, గ్రహాలు ఒకే వరుసలో కనిపించడం అనేది ప్రత్యేకమైన సన్నివేశమే కానీ అరుదైన ఘటన కాదు. సూర్యుని చుట్టూ తమ కక్ష్య మార్గాల కారణంగా, గ్రహాలు తరచుగా గ్రహమండల (ecliptic plane)పై సమాంతరంగా కనిపిస్తాయి. గ్రహాల పరిభ్రమనాన్ని బట్టి, వాటి స్థానాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. 2016, 2022లో కూడా గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కనిపించాయి. మళ్లీ ఇలాంటి ఘటనలు ఆగస్ట్ 2025, అక్టోబర్ 2028, ఫిబ్రవరి 2028లో జరుగుతాయని నాసా వివరించింది. సూర్యునికి ఒకేవైపు ఈ గ్రహాలు ఉండడం వల్ల ఇలా ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయని, వీటిని నేరుగా కంటితో చూడడం అన్ని సందర్భాల్లో కుదరదని, టెలిస్కోప్ లాంటి పరికారాలతో వీటిని చూసే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

ఆస్ట్రేలియాలో తీసిన 2022 నాటి ఫోటోని 2025 ప్రయాగరాజ్ కుంభమేళాలో కనిపించిన ‘ప్లానెటరీ పరేడ్’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.