Fake News, Telugu
 

సముద్రంలో శ్రీరాముని ఆయుధం, ‘విల్లు’ దొరికిందని చెప్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు

0

‘సముద్రంలో దొరికిన శ్రీరాముని విల్లు దైవ ఆయుధం’ అని క్లెయిమ్ చేస్తూ, ఒక పెద్ద విల్లును నీటిలో నుంచి బయటకు తీస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: సముద్రంలో దొరికిన శ్రీరాముని ఆయుధమైన విల్లు యొక్క దృశ్యాలను చూపిస్తున్న వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఇటీవల సముద్రంలో రాముని విల్లు కనుగొనబడింది అని చెప్తూ ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లేవు. అలాగే, వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసినది.  కావున, వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఇటీవల కాలంలో సముద్రంలో శ్రీరాముని విల్లు దొరికినట్లు మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు కానీ, ప్రభుత్వం లేదా పురావస్తు శాఖ వారి అధికారిక ప్రకటనలు కానీ మాకు లభించలేదు. నిజంగా, ఇటువంటి సంఘటన జరిగి ఉంటే దాన్ని మీడియా సంస్థలు తప్పకుండా రిపోర్ట్ చేసేవి.

వైరల్ వీడియోని మేము సరిగ్గా పరిశీలిస్తే, అందులో చాలా చోట్ల తప్పిదాలు/క్రమరాహిత్యాలు ఉన్నాయని మేము గమనించాము. వీడియోలో ఉన్న పోలీసుల మొహాలు మసక మసకగా ఉంటాయి, అసలు సరిగ్గా కనిపించవు. కొంతమంది చేతులు, కొన్ని ఫ్రేములలో మాయమైపోయి మళ్లీ కనిపిస్తాయి.  ఒక పోలీస్ ఆఫీసర్ చేతిలో ఒక కాగితం వచ్చి మళ్లీ కొన్ని  ఫ్రేముల తర్వాత మాయం అయిపోతుంది. ఇవన్నీ గమనించగా, ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసినది అయి ఉండవచ్చు అని మాకు అనుమానం వచ్చింది. AI-జనరేటెడ్ వీడియోలు, ఫోటోలలో ఇటువంటి తప్పిదాలు సహజంగా ఉంటాయి.

ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి, AI రూపొందించిన వీడియోలను కనుగొనే టూల్స్ అయిన Cantilux మరియు DeepFake-O-Meterలను మేము ఉపయోగించాము. వాటి ఎనాలిసిస్ రిపోర్టులలో ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసింది అని తేలింది.

ఈ వీడియోని ఎవరు అప్లోడ్ చేశారు వంటి వివరాలు తెలుసుకోవడం కోసం అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, దీన్ని మొదటగా ‘mrmahadevshorts1’ అనే ఇన్స్టాగ్రామ్ ‘Digital Creator’ అప్లోడ్ చేశారని మేము తెలుసుకున్నాము. 

ఈ పేజీలో వైరల్ వీడియో లాంటి చాలా వీడియోలు ఉన్నాయి. వీటిలో కొన్ని వీడియోలపై ‘Ai God Video’ అని రాసి ఉంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియోని ఎలా తయారు చేశారు, ఎవరు చేసారు లాంటి విషయాలు తెలుసుకోవడం కోసం మేము ‘mrmahadevshorts1’ ఇన్స్టాగ్రామ్ పేజీ వారికి మెసేజ్ చేశాము. సమాధానం అందిన వెంటనే ఈ ఆర్టికల్ అప్డేట్ చేస్తాము.

చివరగా, సముద్రంలో శ్రీరాముని ఆయుధం, ‘విల్లు’ దొరికిందని చెప్తూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి తయారు చేసిన వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll