Deepfake, Fake News, Telugu
 

HCU పరిధిలోని కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం చదును చేస్తుండటంతో అక్కడి వన్యప్రాణులు భయంతో పారిపోతున్నట్లుగా AI-జనరేటెడ్ ఫోటోను షేర్ చేస్తున్నారు

0

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)ను పరిధిలో ఉన్న కంచ గచ్చిబౌలిలోని సర్వే నం. 25లో 400 ఎకరాలను భూమిని టీజీఐఐసీ (TGIIC) ద్వారా వివిధ ప్రాజెక్టులకు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెబుతుండగా, ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 30 మార్చి 2025న ఈ భూములను జేసీబీలతో చదును చేసే పనులు ప్రభుత్వం ప్రారంభించగా, ఈ భూములు జింకలు, నెమళ్లు, తాబేళ్లు, పక్షులు సహా పలు రకాల వణ్యప్రాణులకు ఆవాసంగా ఉందని, పర్యావరణాన్ని నాశనం చేయొద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తూ హెచ్‌సీయూ విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలోనే, కంచ గచ్చిబౌలిలో బుల్డోజర్లు, జేసీబీలతో పనులు చేస్తుంటే, జింకలు, నెమళ్లు భయ ఆందోళనకు గురై అక్కడి నుండి పారిపోతున్నట్లు చూపిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూములను బుల్డోజర్లు, జేసీబీలతో చదును చేస్తుంటే, జింకలు, నెమళ్లు భయ ఆందోళనకు గురై అక్కడి నుండి పారిపోతున్నట్లు చూపిస్తున్న ఫోటో.

ఫ్యాక్ట్(నిజం): వైరల్ అవుతున్న ఈ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడింది. 30 మార్చి 2025న, హెచ్‌సీయూ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూములను చదును చేసే పనులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించగా, ఈ భూములు జింకలు, నెమళ్లు, తాబేళ్లు, పక్షులు సహా పలు రకాల వణ్యప్రాణులకు ఆవాసంగా ఉందని, పర్యావరణాన్ని నాశనం చేయొద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తూ హెచ్‌సీయూ విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోను మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ ఫోటోలో జేసీబీలతో పనులు చేస్తుంటే, ఆ ప్రదేశంలో దుమ్ము ధూళి పైకి లేస్తుండగా, భయంతో జింకలు, నెమళ్లు పరుగెత్తుతున్నట్లుగా ఉంది. కానీ, వైరల్ ఫోటోలో మనుషులెవరూ లేకపోవడం మనం గమనించవచ్చు, అలాగే ఫోటోలోని కొన్ని దృశ్యాలు అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఈ వైరల్ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసింది ఏమో అనే అనుమానం కలుగుతోంది.

తదుపరి మేము ఈ వైరల్ ఫోటో AI-జనరేటెడ్? కాదా? అని నిర్ధారించడానికి,  HivewasitAISightengine, AI OR NOT వంటి పలు AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్స్ ని ఉపయోగించి ఈ వైరల్ ఫోటోను పరిశీలించగా, ఈ వైరల్ ఫోటో 99.2% AI-జనరేటెడ్ ఫోటో కావచ్చని Hive ఫలితాన్ని ఇవ్వగా, ఈ ఫోటో 99% AI-జనరేటెడ్ ఫోటో కావచ్చని Sightengine ఫలితాన్ని ఇచ్చింది.

అలాగే wasitAI, AI OR NOT కూడా ఈ వైరల్ ఫోటో AI- జనరేటెడ్ కావచ్చని ఫలితాన్ని ఇచ్చింది.

2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీకి 850 ఎకరాలు కేటాయించగా, అందులో 400 ఎకరాలను కంచ గచ్చిబౌలిలోని సర్వే నం. 25లో సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించిన భూముల నుంచి తీసుకుని ఇచ్చింది. స్పోర్ట్స్ డెవలప్‌మెంట్‌కు దీన్ని వినియోగించాలనేది లక్ష్యం. జనవరి 2004లో ఐఎంజీ అకాడమీకి ఈ భూముల బదలాయింపు జరిగింది. ఐఎంజీ అకాడ‌మీ నిర్దేశిత సమయంలో పనులు ప్రారంభించ‌క‌పోవ‌డంతో న‌వంబ‌రు 2006లో అప్పటి రాష్ట్ర ప్ర‌భుత్వం భూముల కేటాయింపు రద్దు చేసింది. దీనిపై అదే ఏడాది ఐఎంజీ అకాడమీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భూముల కేటాయింపు రద్దుపై సుదీర్ఘ కాలం వాదనల తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ, మార్చి 2024లో హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తర్వాత, ఈ విషయంపై ఐఎంజీ అకాడమీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మే 2024లో ఐఎంజీ అకాడమీ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ, ఈ భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో, తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని అభివృద్ధి చేసి వేలం వేయాలని నిర్ణయించింది (ఇక్కడ).

చివరగా, HCU పరిధిలోని కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం చదును చేస్తుండటంతో అక్కడి వన్యప్రాణులు భయంతో పారిపోతున్నట్లుగా AI-జనరేటెడ్ ఫోటోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll