డిసెంబర్ 2025లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు భగవద్గీతను బహుమానంగా ఇచ్చారు (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో, పుతిన్ ఒక విమానంలో భగవద్గీత చదువుతున్నప్పుడు తీసిందని చెప్తున్న ఫోటో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 2025 భారత పర్యటన తర్వాత విమానంలో భగవద్గీత చదువుతున్నప్పుడు చిత్రించిన ఫోటో.
ఫ్యాక్ట్ (నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన ఇమేజ్. ఇది AI ఉపయోగించి తయారు చేసిన ఇమేజ్ అని AI కంటెంట్ డిటెక్షన్ టూల్స్ గుర్తించాయి. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక విమానంలో భగవద్గీత చదువుతున్నప్పుడు తీసిన ఫోటో ఇది అని చెప్తూ మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు.
ఆ తర్వాత, వైరల్ ఫోటోను మేము సరిగ్గా పరిశీలించగా, ఈ ఫోటో ఉన్న టెక్సచర్, పుస్తకం పై ఉన్న టెక్స్ట్ సరిగ్గా లేకపోవడం వంటి అవకతవకలు మేము గమనించాము. ఇది మాకు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన ఇమేజ్ అని దీని ద్వారా అనిపించింది. దీన్ని వెరిఫై చేయడానికి హైవ్ అనే AI-కంటెంట్ డిటెక్షన్ టూల్ ఉపయోగించి చూసాము. ఇది AI-జనరేటెడ్ ఇమేజ్ అని హైవ్ గుర్తించింది.

ముఖ్యంగా, గూగుల్ AI ఉపయోగించి తయారు చేసిన కంటెంట్ మీద Synth ID అనే ఒక కనపడని వాటర్‌మార్క్ ఉంటుంది. ఈ ఇమేజ్ మీద Synth ID ఉందని గూగుల్ వారి Synth ID డిటెక్టర్ గుర్తించింది.

చివరగా, ప్రధాని మోదీ తనకి భగవద్గీత బహూకరించిన తర్వాత, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక విమానంలో కూర్చొని దాన్ని చదువుతున్నప్పుడు తీసిన నిజమైన ఫోటో అని ఒక AI-జనరేటెడ్ ఇమేజీని తప్పుగా షేర్ చేస్తున్నారు.

