Fake News, Telugu
 

అక్టోబర్ 2021 నుండి అదానీ గ్రూప్ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది

0

“సంచలన నిర్ణయంతో మోదీకి షాకిచ్చిన కేరళ వామపక్ష ప్రభుత్వం, తిరువనంతపురం ఎయిర్ పోర్టును ప్రైవేటీకరణ చేసి అదానీకి కట్టబెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎయిర్ పోర్ట్ ను కాపాడిన ముఖ్యమంత్రి పినరయ్ విజయన్” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం తిరువనంతపురం విమానాశ్రయాన్ని కొనుగోలు చేసి, కేంద్రం విమానాశ్రయాన్ని అదానీకి కేటాయించకుండా కాపాడింది.

ఫాక్ట్(నిజం): అక్టోబర్ 2021 నుండి అదానీ గ్రూప్ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. అయితే, 2019లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ప్రాతిపదికన తిరువనంతపురం విమానాశ్రయాన్ని 50 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించగా, విమానాశ్రయ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం కేరళ హైకోర్టులో పిటిషన్ (WP(C) 6823/2019) దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్‌ను కేరళ హైకోర్టు 2020 అక్టోబర్‌లో కొట్టివేసింది. కేరళ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, కేరళ ప్రభుత్వం 2020లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు 17 అక్టోబర్ 2022న కొట్టివేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

తిరువనంతపురం విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం అదానీకి కేటాయించకుండా పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం కొనుగోలు చేసిందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన అదానీ తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ATIAL), 2021 నుండి 50 సంవత్సరాల పాటు విమానాశ్రయాన్ని నిర్వహించనున్నట్లు 2021లో ప్రచురితమైన పలు కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). దీన్ని బట్టి అక్టోబర్ 2021 నుండి, తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు & నిర్వహణను అదానీ గ్రూప్ నిర్వహిస్తోంది అని తెలుస్తుంది.

తదుపరి, మేము ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించగా, 2021లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణను అదానీకి చెందిన అదానీ తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌కు 50 సంవత్సరాల పాటు అప్పగించిందని తెలిసింది.

అలాగే, తిరువనంతపురం విమానాశ్రయం అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) పరిశీలిస్తే, ప్రస్తుతం అదానీ సంస్థే విమానాశ్రయ కార్యకలాపాలు & నిర్వహణను నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే, 2019లో, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్రం తిరువనంతపురం విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్‌కు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ప్రాతిపదికన 50 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించాయి. అయితే, పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకించింది. దీనిపై కేరళ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.

తిరువనంతపురం విమానాశ్రయ నిర్వహణను అదానీ గ్రూప్‌కు అప్పగించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం 2019లో కేరళ హైకోర్టులో పిటిషన్ (WP(C) 6823/2019) దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్‌ను కేరళ హైకోర్టు 2020 అక్టోబర్‌లో కొట్టివేసింది. ఈ తీర్పు కాపీని ఇక్కడ చూడవచ్చు.

అయితే కేరళ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2020లో కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ దాఖలు చేసింది. “ప్రతి దేశీయ ప్రయాణీకుడికి, కేరళ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఇచ్చిన ₹135 ఆఫర్ కంటే అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అందించిన బిడ్ ₹168, 20% ఎక్కువగా ఉందని, అలాగే అక్టోబర్ 2021 నుండి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుండి విమానాశ్రయం యొక్క “ఆపరేషన్, నిర్వహణ మరియు అభివృద్ధి”ని ప్రైవేట్ సంస్థ (అదానీ) ఇప్పటికే స్వాధీనం చేసుకుందని” పేర్కొంటూ భారత ప్రధాన న్యాయమూర్తి U.U.లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం, 17 అక్టోబర్ 2022న, ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది (ఇక్కడ & ఇక్కడ, & ఇక్కడ).

2020లో, విమానాశ్రయ ప్రైవేటీకరణపై కేరళ సీఎం పినరయి విజయన్ వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో, అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ట్విటర్ ద్వారా స్పందిస్తూ, తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించే నిర్ణయానికి సంబంధించిన వాస్తవాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.

అంతర్జాతీయ బిడ్డింగ్ ప్రక్రియలో కేరళ ప్రభుత్వం అర్హత సాధించలేదంటూ వరుస ట్వీట్లలో ఈ నిర్ణయంపై ఆయన వివరణ ఇచ్చారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) ప్రాతిపదికన 50 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని కేంద్రం పారదర్శక నిర్ణయం (2019లో) తీసుకుందని వివరించారు. అదానీ ప్రయాణీకుడికి 168 రూపాయల చొప్పున కోట్ చేయగా, కేరళ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ (కెఎస్ఐడీసీ) 135 రూపాయల చొప్పున, మూడవ క్వాలిఫైయింగ్ బిడ్డర్ 63 రూపాయలు కోట్ చేశారన్నారు. 10 శాతం తేడా ఉండి ఉంటే ఈ బిడ్డింగ్ కేరళకే దక్కి ఉండేదని 19.64 శాతం ఉన్న నేపథ్యంలో అదానీని ఎంపిక చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం భారతదేశంలో 14 విమానాశ్రయాలు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) కింద నడుస్తున్నాయి.

చివరగా, అక్టోబర్ 2021 నుండి, తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు & నిర్వహణను అదానీ గ్రూప్ నిర్వహిస్తోంది.

Share.

About Author

Comments are closed.

scroll