సోషల్ మీడియా నిషేధంతో నేపాల్‌లో మొదలైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో సుమారు 51 మంది వరకు మరణించారు. ఆందోళనకారులు ప్రముఖ ప్రభుత్వ భవనాలను, రాజకీయనాయకుల ఇళ్లపై దాడి చేసి నిప్పంటించారు. సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత కూడా ఆందోళనలు, నిరసనలు కొనసాగే సరికి నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ 9 సెప్టెంబర్ 2025న తన పదవికి రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఫోటో ఉన్న బ్యానర్ పట్టుకుని కొందరు నడుచుకుంటూ వస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేపాలీ హృదయాల్లో ప్రధాని మోదీ అని చెప్తూ యూజర్లు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: నేపాల్‌లో సెప్టెంబర్ 2025లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో భారత ప్రధాని మోదీని సమర్థిస్తూ నేపాల్ దేశస్తులు చేపట్టిన ఒక ర్యాలీకి చెందిన వీడియో.
ఫ్యాక్ట్ (నిజం): ఈ వీడియోకు నేపాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఇది సిక్కిం రాష్ట్రానికి చెందినది. ఇందులో ఉన్న వ్యక్తులు సిక్కిం రాష్ట్రానికి చెందిన లింబు తెగ వారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు
ఈ వీడియోని సరిగ్గా పరిశీలిస్తే, వీడియోలో కనిపిస్తున్న బ్యానర్ పైన “SIKKIMESE LIMBOO TRIBES WARMLY WELCOME TO HONOURABLE PRIME MINISTER OF INDIA SHRI NARENDRA MODI JI TO THE STATE OF SIKKIM. Sukhim Yakthung Sapsok Songchumbho.,” అని రాసి ఉండటం మనం గమనించవచ్చు. దీనిబట్టి, ఈ వీడియో భారతదేశంలోని సిక్కింలో తీసినది అని, దీనికి నేపాల్‌కు ఎటువంటి సంబంధం లేదని మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక, ఈ వీడియో గురించి మరిన్ని వివరాల కోసం, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతుకగా, వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను పోలిన వీడియోలు ఉన్న 29, 30 మే 2025 నాటి చాలా సోషల్ మీడియా పోస్టులు మాకు కనిపించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియోలలో వైరల్ వీడియోలలో కనిపిస్తున్న బ్యానర్, అలాగే బ్యానర్ పట్టుకున్న వ్యక్తులని మనం చూడవచ్చు.


సిక్కిం రాష్ట్ర అవతరణకు 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో, ప్రధాని మోదీని తమ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా, 29 మే 2025న సిక్కిమ్మీస్ లింబూ తెగ వారు, ‘సుఖ్మీ యాఖ్తుంగ్ సాప్‌సోక్ సొంగ్‌చుంభో’ సంస్థ బ్యానర్ కింది చేపట్టిన ఒక ర్యాలీకు చెందిన వీడియో ఇది.
‘సుఖ్మీ యాఖ్తుంగ్ సాప్‌సోక్ సొంగ్‌చుంభో’ వారు 30 మే 2025న ఫేస్‌బుక్‌లో ఈ ర్యాలీకి సంబంధించిన వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియో, ఇంకా వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలకు మధ్య ఉన్న పోలికలను మీరు ఈ కింది కొల్లాజ్‌లో చూడవచ్చు.

ఈ వీడియోలో కనిపిస్తున్న బ్యానర్లను బట్టి ఈ ర్యాలీ గాంగ్‌టాక్ నగరంలో జరిగింది. ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రదేశాన్ని మేము గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి కనుగొన్నాను (ఇక్కడ, ఇక్కడ). గాంగ్‌టాక్ నగరంలోని 31 Singtam-Chungthang Rdలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ బజార్ దగ్గర ఈ వీడియో చిత్రించబడింది.

అయితే, వాతావరణం సానుకూలంగా లేని కారణంగా 29 మే 2025న ప్రధాని మోదీ తన సిక్కిం పర్యటనను రద్దు చేసుకొని బాగ్‌దోగ్రా నుంచి సిక్కిం ప్రజలతో వర్చువల్‌గా మాట్లాడారు (ఇక్కడ, ఇక్కడ).
చివరగా, నేపాల్ నిరసనల నేపథ్యంలో భారత ప్రధాని మోదీని సమర్థిస్తూ నేపాల్ దేశస్తులు చేపట్టిన ఒక ర్యాలీకి చెందిన వీడియో అని సిక్కింలో తీసిన వీడియోని షేర్ చేస్తున్నారు.