“ఇటీవల ముంబైలో పోలీసులు చలాన్ జారీ చేయగా, ముస్లింలు వారిని కొట్టారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). మహారాష్ట్రలో 2024 అసెంబ్లీ ఎన్నికలు జరుగుతన్న నేపథ్యంలో ఈ వీడియోను సోషల్ మీడియా విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల 2024లో ముంబైలో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు జారీ చేయడంతో వారిని ముస్లింలు కొడుతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 2015 నాటిది, ఢిల్లీలో జరిగిన ఒక సంఘటనకు చెందినది. ఈ వీడియోలోని దృశ్యాలు జూలై 2015లో నార్త్-ఈస్ట్ ఢిల్లీ పరిధిలోని గోకుల్‌పురిలో ట్రాఫిక్ పోలీసులపై జరిగిన దాడిని చూపిస్తున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం, హెల్మెంట్ ధరించలేదని మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని ట్రాఫిక్ పోలీసులు చలాన్లు జారీ చేయడంతో షానవాజ్, అతని సోదరుడు మరియు తండ్రి సగీర్ అహ్మద్ ట్రాఫిక్ పోలీసులను కొట్టారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపిస్తున్న న్యూస్ రిపోర్ట్ వీడియో ఒకటి లభించింది. ఈ వీడియోను ‘ABP NEWS’ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో, 13 జూలై 2015న షేర్ చేయబడింది. ఈ వీడియో ప్రకారం, ఈ ఘటన నార్త్-ఈస్ట్ ఢిల్లీ పరిధిలోని గోకుల్‌పురిలో చోటుచేసుకుంది, హెల్మెంట్ ధరించలేదని మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని ట్రాఫిక్ పోలీసులు చలాన్లు జారీ చేయడంతో షానవాజ్, అతని సోదరుడు మరియు తండ్రి సగీర్ అహ్మద్ ట్రాఫిక్ పోలీసులను కొట్టారు. ఈ ఘటనను రిపోర్ట్ చేస్తూ 2015లో వివిధ మీడియా సంస్థలు ప్రసారం చేసిన మరిన్ని న్యూస్ వీడియోలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
ఈ ఘటనను రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థులు జూలై 2015లో వార్త కథనాలు పబ్లిష్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 13 జూలై 2015న, ఉదయం సమయంలో ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురిలోని వజీరాబాద్ రోడ్డు సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసి హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నందుకు షానవాజ్(25) మరియు అతని తమ్ముడు అమీర్(18)లను పోలీసులు ఆపి వారి చలాన్ జారీ చేశారు. అయితే షానవాజ్, అమీర్‌లు చెల్లించేందుకు నిరాకరించి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో వారు కానిస్టేబుల్ సంజయ్ భగవాన్ మరియు మనోజ్‌లను దుర్భాషలాడారు మరియు బెదిరించారు. తర్వాత షానవాజ్, అమీర్ చలాన్ చెల్లించకుండా వెళ్లిపోయారు. కానీ కొద్దిసేపటికే, షానవాజ్ మరియు అతని తమ్ముడు వారి తండ్రి సగీర్ అహ్మద్ మరియు దాదాపు డజను మందితో కలిసి సంఘటనా స్థలానికి తిరిగి వచ్చి కానిస్టేబుల్ సంజయ్ మరియు మనోజ్‌లపై దాడి చేశారు.
చివరగా, 2015లో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఇటీవల ముంబైలో ముంబయిలో చలాన్లు జారీ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులను ముస్లింలు కొట్టారు అంటూ షేర్ చేస్తున్నారు.