“తన ఇంట్లో పూజ చేసుకుంటున్న పూజారి ఇంట్లోకి వచ్చి మరీ జిహాదీల దాడి, దీపారాధన గంటల శబ్దం తమకు వినపడకూడదు అని దాడి చేసిన వైనం, ఇది జరిగింది హైదరాబాద్‌లో” అని పేర్కొంటూ కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: హైదరాబాద్‌లో ఒక హిందూ పూజారిపై ముస్లింలు దాడి చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 23 జూలై 2025న ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం పట్టణంలో రమణ అనే చీరల వ్యాపారిపై వడ్డీ వ్యాపారి ఎర్రగుంట రాజా అనుచరులు చేసిన దాడిని చూపిస్తుంది. ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ SHO, Factlyతో మాట్లాడుతూ, ఈ వైరల్ వీడియో ధర్మవరం పట్టణంలో రమణ అనే చీరల వ్యాపారిపై ఎర్రగుంట రాజా అనే వడ్డీ వ్యాపారి అనుచరులు చేసిన దాడిని చూపిస్తుందని, ఈ దాడిలో ఎలాంటి మతపరమైన కోణం లేదని, ఈ దాడి ఘటనలో నిందితులు ఎవరూ ముస్లింలు కాదని పేర్కొన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 28 జూలై 2025న తెలుగు దిన పత్రిక ఈనాడు వెబ్‌సైట్‌లో ప్రచురించిన వార్తా కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ వైరల్ వీడియో ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం పట్టణంలో చీరల వ్యాపారి రమణ, అతని కుటుంబ సభ్యులపై వడ్డీ వ్యాపారి అనుచరులు చేసిన దాడిని చూపిస్తుంది.

దీని ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలోని దృశ్యాలతో కూడిన పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం పట్టణంలో పట్టు చీరల వ్యాపారి రమణ, అతని కుటుంబ సభ్యులపై వడ్డీ వ్యాపారి అనుచరులు మూకదాడి చేశారు. రమణ వ్యాపారం నిమిత్తం వడ్డీ వ్యాపారి ఎర్రగుంట రాజా వద్ద రూ. 6 లక్షలు వారానికి రూ. 10 వడ్డీ చొప్పున అప్పు తీసుకున్నాడు. మూడు నెలలుగా వడ్డీ కట్టడం లేదని 23 జూలై 2025న రాజా తన అనుచరులను రమణ ఇంటికి పంపాడు. వారు ఇంట్లోకి ప్రవేశించి రమణతోపాటు అతడి భార్య భారతిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తల్లిదండ్రులను కొడుతుండటంతో 12 ఏళ్ల కుమారుడు చరణ్ సాయి అడ్డు వెళ్లగా బాలుడిపైన కూడా వారు దాడి చేసి కొట్టారు. వారి అరుపులు విన్న స్థానికులు అక్కడికి రావడంతో దాడి చేసిన యువకులు వెళ్లిపోయారు. రూ.6 లక్షలు అప్పు తీసుకోగా రూ.15 లక్షలు వడ్డీ కట్టామని ఇంకా అసలు, వడ్డీ కట్టాలని ఇంట్లోకి చొరబడి తమపై దాడి చేసి భర్త జేబులో ఉన్న రూ.7 వేలు లాక్కెళ్లారని భారతి ధర్మవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజాతో పాటు అతడి అనుచరుల పైన కేసు నమోదు చేశామని, వారి కోసం గాలిస్తున్నామని రెండో పట్టణ సీఐ రెడ్డప్ప మీడియాకు తెలిపారు.
తదుపరి మేము ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ కేసును విచారిస్తున్న ధర్మవరం రెండో పట్టణ పోలీసులను సంప్రదించగా, మాతో (Factly) 2 టౌన్ SHO రెడ్డప్ప మాట్లాడుతూ, “ఈ వైరల్ వీడియో ధర్మవరం పట్టణంలో రమణ అనే చీరల వ్యాపారిపై ఎర్రగుంట రాజా అనే వడ్డీ వ్యాపారి అనుచరులు చేసిన దాడిని చూపిస్తుంది. ఈ దాడిలో మతపరమైన కోణం లేదు. ఈ సంఘటనలో నిందితులు ఎవరూ ముస్లింలు కాదు” అని అన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి నమోదైన FIR కాపీని మాకు షేర్ చేశారు. ఈ దాడికి సంబంధించి నమోదైన FIRలో వడ్డీ వ్యాపారి ఎర్రగుంట రాజాను A1గా పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నమోదైన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఈ వైరల్ వీడియో 23 జూలై 2025న ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం పట్టణంలో చీరల వ్యాపారిపై వడ్డీ వ్యాపారి, అతని అనుచరులు చేసిన దాడిని చూపిస్తుంది.