Fake News, Telugu
 

మణిపూర్‌లో ఉగ్రవాదుల నుంచి భారత సైన్యం భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంది అంటూ మయన్మార్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

14 మే 2025న మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోని భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో భద్రతా దళాలు పది మంది సాయుధ మిలిటెంట్లను హతమార్చాయి, అలాగే పెద్ద మొత్తంలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో, “మణిపూర్‌లో ఉగ్రవాదుల నుంచి భారత సైన్యం భారీగా ఆయుధాలు, నగదును స్వాధీనం చేసుకుంది” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో సైనిక యూనిఫాం ధరించిన వ్యక్తులు భారీగా స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, నగదును ప్రదర్శించడం మనం చూడవచ్చు. ఇదే వీడియోను మణిపూర్‌లో కుకీ ఉగ్రవాదుల నుంచి భారత సైన్యం భారీగా ఆయుధాలు, నగదును స్వాధీనం చేసుకుంది అని కూడా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మణిపూర్‌లో కుకీ ఉగ్రవాదుల నుంచి భారత సైన్యం భారీగా ఆయుధాలు, నగదును స్వాధీనం చేసుకుంది, అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు; ఈ వీడియో మయన్మార్‌కి సంబంధించినది. ఈ వైరల్ వీడియో ఏప్రిల్ 2025లో చిన్ బ్రదర్‌హుడ్ తిరుగుబాటు సేనలు మయన్మార్‌ ఆర్మీ నుండి ఫలాం పట్టణం స్వాధీనం చేసుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, 09 ఏప్రిల్ 2025న చిన్ బ్రదర్‌హుడ్ తిరుగుబాటు సేనలు మయన్మార్‌లోని చిన్ స్టేట్‌లోని ఫలాం పట్టణంలో మయన్మార్ ఆర్మీకి సంబంధించిన చివరి స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాయి. ఆర్మీ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ (IB) 268 కి చెందిన ఈ స్థావరాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా, చిన్ బ్రదర్‌హుడ్ సేనలు ఉత్తర చిన్ స్టేట్‌లోని ఫలాం పట్టణంపై పూర్తి నియంత్రణ సాధించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా, ఈ వైరల్ వీడియోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ వీడియోలో కనిపించే వ్యక్తులు ధరించిన యూనిఫామ్‌లపై ‘B.N.R.A’ అని రాసి ఉండటం మనం చూడవచ్చు. భారత ఆర్మీలో BNRA పేరుతో ఎటువంటి రెజిమెంట్ లేదు (ఇక్కడ).  BNRA (బర్మా నేషనల్ రివల్యూషన్ ఆర్మీ/ ఫోర్స్) అనేది మయన్మార్‌లోని సాగైంగ్ డివిజన్‌లో పనిచేస్తున్న శక్తివంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థ (ఇక్కడ, ఇక్కడ).

తదుపరి, ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలను పలువురు ఏప్రిల్ 2025లో సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియో కొందరు BNRAకు, చిన్ బ్రదర్‌హుడ్ ఉద్యమానికి ముడిపెడుతూ షేర్ చేశారు. అలాగే ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోలను మయన్మార్‌కు చెందిన పలువురు సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు మేము గుర్తించాము. వారు కూడా ఈ వీడియోను మయన్మార్‌లో ప్రస్తుత మిలటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్ బ్రదర్‌హుడ్ పేరుతో  అక్కడ తిరుగుబాటు చేస్తున్న పలు సంస్థలకు ఈ వీడియో ముడిపెడుతూ షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ మయన్మార్‌కు చెందిన పలు మీడియా సంస్థలు కథనాల ప్రచురించినట్లు మేము గుర్తించాము. ఈ కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), సుమారు ఐదు నెలల పోరాటం తర్వాత 09 ఏప్రిల్ 2025న చిన్ బ్రదర్‌హుడ్ తిరుగుబాటు సేనలు చిన్ స్టేట్‌లోని ఫలాం పట్టణంలో మయన్మార్ ఆర్మీకి మిగిలి ఉన్న ఏకైక స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాయి. ఆర్మీ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ (IB) 268 కి చెందిన ఈ స్థావరాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా, చిన్ బ్రదర్‌హుడ్ ఉత్తర చిన్ స్టేట్‌లోని ఫలాం పట్టణంపై పూర్తి నియంత్రణ సాధించింది.

చిన్ బ్రదర్‌హుడ్ సేనలు మయన్మార్‌ ఆర్మీ నుండి ఫలాం పట్టణం స్వాధీనం చేసుకున్నాయి పేర్కొంటూ మయన్మార్‌ మీడియా సంస్థలు ఏప్రిల్ 2025లో ప్రచురించిన మరిన్ని కథనాలను ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఏప్రిల్ 2025లో చిన్ బ్రదర్‌హుడ్ తిరుగుబాటు సేనలు మయన్మార్‌ ఆర్మీ నుండి ఫలాం పట్టణం స్వాధీనం చేసుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుందని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, ఈ వైరల్ వీడియోకు భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు; ఈ వీడియో మయన్మార్‌కి సంబంధించినది.

Share.

About Author

Comments are closed.

scroll