Fake News, Telugu
 

తెలంగాణలో రోహింగ్యా ముస్లింలు బట్టలు నేస్తున్న దృశ్యాలంటూ బంగ్లాదేశ్‌కు సంబంధించిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు

0

సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో జరిగిన ఓ పార్కింగ్ వివాదం, తెలంగాణ వ్యాప్తంగా ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమంగా మారింది, ఈ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ (OU) విద్యార్థులు మద్దతుగా 22 ఆగస్టు 2025న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. పలు రాజకీయ పార్టీ నాయకులు దీన్ని ఖండిస్తూ మార్వాడీ వర్గానికి మద్దతు ఇవ్వడంతో పోలీసులు OU JAC చైర్మన్‌తో సహా అనేక మంది విద్యార్థి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో, “తెలంగాణలోకి అక్రమంగా చొరబడిన రోహింగ్యా ముస్లింలు ఇక్కడి స్థానిక చేనేత పద్మశాలిల కులవృత్తినీ చేస్తూ వారిని దెబ్బ తీశారు అంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియోలో ఓ ముస్లిం టోపీ ధరించిన వ్యక్తి బట్టలు నేస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణలోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యా ముస్లింలు బట్టలు నేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ముస్లింలు బట్టలు నేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న ఈ వైరల్ వీడియో తెలంగాణకు లేదా భారతదేశానికి సంబంధించినది కాదు. ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని నారాయణగంజ్ జిల్లా అరైహజర్ ఉపజిల్లాలోని గ్రామ్‌గంజ్ అనే గ్రామంలో అక్కడి స్థానిక చేనేత కార్మికులు బట్టలు నేస్తున్న దృశ్యాలను చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను కలిగి ఉన్న వీడియో బంగ్లాదేశ్‌కు చెందిన ఎండి రూబెల్ (Md Rubel) అనే బ్లాగర్ (సోషల్ మీడియా కంటెనెట్ క్రియేటర్) 19 ఆగస్టు 2025న ఫేస్‌బుక్‌లో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.

ఈ ఫేస్‌బుక్ ఖాతాను పరిశీలించగా, వైరల్ వీడియోలోని దృశ్యాలనే కలిగిన మరిన్ని వీడియోలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అలాగే ఓ వీడియోలో బ్లాగర్ రూబెల్ ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారో పేర్కొన్నాడు.

ఈ వీడియోల వివరణల ప్రకారం, ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌లోని నారాయణగంజ్ జిల్లా అరైహజర్ ఉపజిల్లాలోని గ్రామ్‌గంజ్ అనే గ్రామంలో అక్కడి స్థానిక చేనేత కార్మికులు బట్టలు నేస్తున్న దృశ్యాలను చూపిస్తుంది. గ్రామ్‌గంజ్ గ్రామంలో అక్కడి స్థానిక చేనేత కార్మికులు బట్టలు నేస్తున్న దృశ్యాలను చూపించే మరిన్ని వీడియోలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

అలాగే ఎండి రూబెల్ (Md Rubel) తన ఫేస్‌బుక్‌ బయోలో తన ఫేస్‌బుక్‌ పేజీలో బంగ్లాదేశ్ సాంప్రదాయ చేనేత కళ వీడియోలను చూపిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ సమాచారం ఆధారంగా, ఈ వీడియో బంగ్లాదేశ్‌కు సంబంధించినదిగా మనం నిర్ధారించవచ్చు.

చివరగా, ముస్లింలు బట్టలు నేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌కు సంబంధించినది.

Share.

About Author

Comments are closed.

scroll