Fake News, Telugu
 

గతంలో బెంగళూరులో జరిగిన బంగ్లాదేశీ మహిళ అత్యాచారానికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆందోళనలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

బంగ్లాదేశ్‌లో ఆందోళనల నేపథ్యంలో అక్కడి హిందువులపై దాడులు జరుగుతున్నాయని, అలాగే హిందూ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ఒక మహిళను వేధిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇదే వీడియోకు సంబంధించి వివరణ కోరుతూ చాలా మంది మా వాట్సాప్ టిప్‌లైన్‌కు ఈ వీడియోను పంపించారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో తెలుసుకుంద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బంగ్లాదేశ్‌లో ఆందోళనల నేపథ్యంలో అక్కడి హిందూ మహిళలపై అత్యాచారాలు చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2021లో బెంగళూరులో జరిగిన బంగ్లాదేశీ మహిళ అత్యాచారానికి సంబంధించింది.  బెంగళూరులో ఉంటున్న కొందరు బంగ్లాదేశీ అక్రమ వలసదారులు తమతో పాటు వచ్చిన బంగ్లాదేశీ మహిళను అత్యాచారం చేసారు. ఈ వీడియోతో ప్రస్తుత బాంగ్లాదేశ్ అల్లర్లకు ఎలాంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. పలు రిపోర్ట్స్ ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లలో కొన్ని చోట్ల నిరసనకారులు మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేసి వారి విలువైన వస్తువులను దోచుకున్నారని తెలుస్తుంది. అలాగే  హిందువుల ఇళ్లను, దేవాలయాలను ధ్వంసం చేయడం, తగులబెట్టడం, మహిళలపై దాడి చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నట్లు మరికొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ & ఇక్కడ).

ఐతే సోషల్ మీడియాలో ఇప్పుడు షేర్ అవుతున్న ఈ వీడియోకు ప్రస్తుతం జరుగుతున్న బాంగ్లాదేశ్ ఆందోళనలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను జులై 2021లో రిపోర్ట్ చేసిన పలు బంగ్లాదేశీ వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ఈ దృశ్యాలు 2021లో బెంగళూరులో జరిగిన ఒక బంగ్లాదేశీ మహిళ అత్యాచారానికి సంబంధించినవి. బెంగుళూరులో ఉంటున్న కొందరు బంగ్లాదేశీ అక్రమ వలసదారులు తమతో పాటు వచ్చిన బంగ్లాదేశీ మహిళను అత్యాచారం చేసారు (ఇక్కడ).

ఈ సంఘటన 2021 మేలో బెంగళూరులో రామమూర్తి నగర్‌లో జరిగింది. 22 ఏళ్ల యువతిపై దాడి చేసి అత్యాచారం చేసిన ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో సహా 12 మంది బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కథనం ప్రకారం నిందితులను శోబూజ్ షేక్, రఫీక్, రిడోయ్ బాబు, రకీబుల్ ఇస్లాం సాగర్, మహమ్మద్ బాబు షేక్, హకిల్, అజీమ్, జమాల్, దలీమ్, నస్రత్, కాజల్, తాన్యలుగా గుర్తించారు. ఐతే నిందితుల్లో కొందరిపై అంతకుముందే మహిళల అక్రమ రవాణాకు సంబంధించి కేసులు ఉన్నాయి (ఇక్కడ & ఇక్కడ).

ఈ ఘటనపై బెంగళూరు పోలీస్ కమిషనర్ స్పందిస్తూ బాధితురాలుతో పాటు నిందితుల్లో 11 మంది బాంగ్లాదేశ్ జాతీయులని తెలిపారు. ఈ సమాచారాన్ని బట్టి ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ వీడియోకు బాంగ్లాదేశ్ అల్లర్లకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది.

చివరగా, గతంలో బెంగళూరులో జరిగిన బంగ్లాదేశీ మహిళ అత్యాచారానికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆందోళనలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll