Fake News, Telugu
 

మధ్యప్రదేశ్ రత్లాంలో RSS శతాబ్ది వేడుక సందర్భంగా జరిగిన మార్చ్ వీడియోను, స్టాలిన్‌కు వ్యతిరేకంగా RSS చేసిన అరుణాచల గిరి ప్రదక్షిణ అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు

0

‘తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హిందూ వ్యతిరేక అభిప్రాయాలను నిరసిస్తూ లక్షలాది మంది RSS కరసేవకులు అరుణాచల శివ గిరి ప్రదక్షిణ చేస్తున్న దృశ్యాలు’ అంటూ చాలా మంది మార్చ్ చేస్తున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో చూద్దాం.

ఆర్కైవ్ చేసిన వీడియోను ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హిందూ వ్యతిరేక అభిప్రాయాలను నిరసిస్తూ లక్షలాది మంది RSS కరసేవకులు అరుణాచల శివ గిరి ప్రదక్షిణ చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో RSS శతాబ్ది వేడుకలలో భాగంగా నిర్వహించిన ఒక మార్చ్‌ను చూపిస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసిస్తూ అరుణాచల కొండను ప్రదక్షిణ చెయ్యటాన్ని కాదు. కాబట్టి, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న 6 నిమిషాల 38 సెకన్ల వెర్షన్ వీడియోను ఫేస్‌బుక్‌లో కనుగొన్నాము. ఈ పోస్టు యొక్క శీర్షిక ద్వారా ఇది RSS యొక్క 100 సంవత్సరాల మార్చ్ పాస్ట్ అని తెలిపింది. అంతే కాకుండా, యూజర్లు ఇది రత్లాం, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది అని కామెంట్ చెయ్యటం మేము గమనించాం. 

దీని గురించి మరింత వెతకగా, ఈ వీడియో ఆర్గనైజర్ వీక్లీ యొక్క X పేజీలో 6 అక్టోబర్ 2025న ‘A grand RSS Path Sanchalan was held in Ratlam, Madhya Pradesh. #RSS 100 Years’ అనే శీర్షికతో పోస్టు చెయ్యటం మేము గమనించాం. ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ ఈ మార్చ్‌ మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో నిర్వహించారని పోస్టు చెయ్యబడ్డ అనేక సోషల్ మీడియా పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 

దీన్ని ఆధారంగా తీసుకోని తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, 5 అక్టోబర్ 2025న, రత్లాంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది సందర్భంగా వేలాది మంది స్వయం సేవకులు ఐక్యంగా మార్చ్ చేసినట్టు నివేదికలు కూడా వెల్లడించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

రత్లాంలోని ఐదు ప్రదేశాల నుండి మార్చ్ ప్రారంభమై, మహారాణా ప్రతాప్ చౌక్ వద్ద సమావేశమై, ఆపై పవర్ హౌస్ రోడ్, దో బట్టి మీదుగా వెళ్లి, అంబేద్కర్ గ్రౌండ్‌లో ముగిసిందని అమర్ ఉజాల నివేదిక పేర్కొంది. 

వైరల్ వీడియోలో ‘అజిత్ ’ అలాగే ‘రిషబ్’ అనే పదాలతో సైన్ బోర్డులను మనం చూడవచ్చు. ఈ రెండు క్లూల ఆధారంగా మేము మహారాణా ప్రతాప్ చౌక్ మరియు అంబేద్కర్ గ్రౌండ్ మధ్య ఉన్న ప్రాంతాన్ని  Google స్ట్రీట్ వ్యూ ఉపయోగిస్తూ వెతికితే అంబేద్కర్ గ్రౌండ్ కి వెళ్ళే దారిలో శాస్త్రి నగర్ రోడ్డులో మేము అవే సైన్ బోర్డులను కనుగొన్నాము. వైరల్ వీడియో, గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ నుండి ఈ సైన్‌బోర్డులను చూపించే స్క్రీన్‌షాట్‌లను క్రింద చూడవచ్చు.

చివరిగా, మధ్యప్రదేశ్ రత్లాంలో RSS శతాబ్ది సందర్భంగా జరిగిన మార్చ్ వీడియోను, స్టాలిన్‌కు వ్యతిరేకంగా RSS చేసిన అరుణాచల గిరి ప్రదక్షిణ అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll