Fake News, Telugu
 

ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఒక కంటెంట్ క్రియేటర్ వీడియోని ప్రధాని మోదీకి ఓట్లు వేయనందుకు హిందువులను విమర్శిస్తున్న ముస్లిం అని షేర్ చేస్తున్నారు

0

ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 4 జూన్ 2024న ప్రకటించబడ్డాయి. మొత్తం 543 పార్లమెంటరీ స్థానాల్లో, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి 293 సీట్లను గెలుచుకోగా, బీజేపీ 240 సీట్లను మాత్రమే పొందింది. ఒక పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 272 సీట్ల అవసరం ఉంటుంది. కానీ,  బీజేపీ కేవలం 240 సీట్లు మాత్రమే గెలుచుకోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీ కూటమి భాగస్వాములతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామ మందిరం కట్టినా మోదీకి ఓట్లు వేయనందుకు హిందువులను ఒక ముస్లిం వ్యక్తి విమర్శిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

క్లెయిమ్: అయోధ్యలో రామ మందిరం కట్టినా ప్రధాని మోదీకి ఓట్లు వేయనందుకు హిందువులను విమర్శిస్తున్న ఒక ముస్లిం వ్యక్తి. 

ఫాక్ట్ (నిజం): వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి ముస్లిం కాదు. ఇతని పేరు ధీరేంద్ర రాఘవ్, ఈయన ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాకి చెందిన ఒక ఆర్టిస్ట్. ఇతను బీజేపీకి అనుకూలంగా వీడియోలు చేసి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తాడు. ధీరేంద్ర రాఘవ్ ముస్లిం వేషధారణతో ఉన్న పలు వీడియోలు తన సోషల్ మీడియా అకౌంట్లలో కనిపించాయి. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది

వైరల్ వీడియోకి సంబంధించిన కీ ఫ్రేమ్స్ ని  రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియో ఇన్‌స్టాగ్రామ్ లో ‘dhirendra_raghav_79′ (ఆర్కైవ్) అనే వెరిఫైడ్ యూసర్ 4 జూన్ 2024న చేసిన పోస్టులో ‘Mosque will be built instead of temple.. #dhokha #hindutemple #bjp’ అనే వివరణతో కనిపించింది.  

ఇతని ఇన్‌స్టాగ్రామ్ బయోలో, ఇతను ఒక ఆర్టిస్ట్ అని, ఇతని పేరు ధీరేంద్ర రాఘవ్ అని ఉంది. ఈయన పేరు కూడా ఇతను ముస్లిం కాదని సూచిస్తుంది. ఇతని ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వీడియోలను పరిశిలిస్తే, ఈయన బీజేపీకి అనుకూలంగా (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) ఇలాంటి వీడియోలనే చాలా చేసినట్టు తెలుస్తుంది. అంతేకాక, ధీరేంద్ర రాఘవ్ ముస్లిం వేషధారణతో చేసిన ఇతర వీడియోలను ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

అంతేకాక, మా పరిశోధనలో ధీరేంద్ర రాఘవ్ యొక్క ఫేస్ బుక్ ప్రొఫైల్ కూడా లభించింది. ఇందులో ఇతను ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాకి చెందిన ఆర్టిస్ట్ అని పేర్కొన్నాడు. ఇదే వైరల్ వీడియోను (ఆర్కైవ్) అతను తన ఫేస్‌బుక్ పేజీలో కూడా షేర్ చేసాడు. దీనిని బట్టి వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి ముస్లిం మతస్థుడు కాదని స్పష్టం అవుతుంది. ఇతను బీజేపీకి అనుకూలంగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడని అర్ధం అవుతుంది. 

చివరగా, ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఒక కంటెంట్ క్రియేటర్ వీడియోని ప్రధాని మోదీకి ఓట్లు వేయనందుకు హిందువులను విమర్శిస్తున్న ముస్లిం అని వీడియోని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll