Update (16 February 2024):
ఈ వీడియోను ముందుగా షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ (cengizler_tarim_55) సంప్రదించగా, ఈ వీడియోను తాను టర్కీలోని సంసున్ ప్రావిన్స్‌లో తీసినట్టు స్పష్టం చేసాడు. దీన్నిబట్టి ఈ వీడియోకు రైతుల ఆందోళనలకు ఎటువంటి సంబంధం లేదు
Published (14 February 2024):
దేశ రాజధాని ఢిల్లీలో రైతులు తిరిగి నిరసనలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ నిరసనలు అడ్డుకునేందుకు పోలీసులు ఉపయోగించే బారికేడ్లను, టియర్ గ్యాస్ షెల్స్, మొదలైన వాటిని ఎదుర్కొనడానికి రైతులు తమ ట్రాక్టర్లకు మార్పులు చేసారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. చుట్టూ రాడ్లతో ఒక కంచేలాగా ఏర్పాటు చేసిన ఒక ట్రాక్టర్‌ను ఈ వీడియోలో చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: పోలీసుల బారికేడ్లను ఎదుర్కొనడానికి రైతులు తమ ట్రాక్టర్ల చుట్టూ రాడ్లతో ఒక కంచే ఏర్పాటు చేసారు.
ఫాక్ట్(నిజం): ఢిల్లీలో రైతుల నిరసనలు 13 ఫిబ్రవరి 2024న మొదలుకాగా, ఈ వీడియోను ముందుగా జనవరి చివరి వారంలో టర్కీకి చెందిన పలు సోషల్ మీడియా అకౌంట్లు షేర్ చేసాయి. పైగా ఈ వీడియోలో టర్కీకి చెందిన ట్రాక్టర్ & బ్యాటరీ కంపెనీ బోర్డులు గమనించొచ్చు. వీటన్నిటి బట్టి, ఈ వీడియో టర్కీకి చెందిందని అనుకోవచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళనలు చేసిన రైతులు, ఇప్పుడు తమ డిమాండ్లను సాధించించుకోవడానికి మరోసారి ఢిల్లీలో ఆందోళనలు మొదలుపెట్టారు. ఐతే ఢిల్లీలో చేపట్టబోయే నిరసనలకు రైతులు మార్పులు చేసిన ట్రాక్టర్లను ఉపయోగించనున్నారని వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ & ఇక్కడ). నిరసనలను అడ్డుకోవడానికి పోలీసులు ఉపయోగించే బారికేడ్లను, టియర్ గ్యాస్ షెల్స్, మొదలైన వాటిని ఎదుర్కొనడానికి రైతులు ఇలా ట్రాక్టర్లకు మార్పులు చేయించి ఉపయోగించనున్నారని కథనాలు రిపోర్ట్ చేసాయి. ఐతే ఈ నేపథ్యంలో ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ ట్రాక్టర్ వీడియోకు ఢిల్లీ రైతుల ఆందోళనలకు ఎటువంటి సంబంధంలేదు.
ముందుగా వీడియోలో కనిపిస్తున్న ట్రాక్టర్‌పై ఉన్న కంపెనీ పేరు “HATTAT 260G” ఆధారంగా వెతకగా ఈ పేరుతో టర్కీలో ఒక ట్రాక్టర్ల తయారీ కంపెనీ ఉందని తెలిసింది. ఈ కంపెనీ యూట్యూబ్ మరియు సోషల్ మీడియా అకౌంట్లలో ఇలాంటి ట్రాక్టర్లనే చూడొచ్చు.
ఆ తరవాత ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోను షేర్ చేసిన టర్కీకి చెందిన పలు సోషల్ మీడియా పోస్టులు మాకు కనిపించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). కాగా ఈ అకౌంట్లు ఈ వీడియో 2024 జనవరి నెల చివర్లో షేర్ చేసాయి. పైగా ఈ వీడియోను షేర్ చేసిన ఒక పోస్టులో ఈ ట్రాక్టర్ యజమాని తానేనని అర్ధం వచ్చేలా ‘Orjinal video ve sahibi benim’ అని టర్కిష్‌లో ఒక కాప్షన్ రాసి ఉంది.
దీన్నిబట్టి ఈ వీడియో ప్రస్తుత రైతుల నిరసనలకు సంబంధించింది కాదని అర్ధమవుతుంది. ఎందుకంటే 08 – 12 ఫిబ్రవరి 2024 మధ్యలో రైతులు ప్రభుత్వంతో చర్చలు జరుపగా, చర్చల విఫలమైన అనంతరం 13 ఫిబ్రవరి 2024న నిరసనలు మొదలుపెట్టారు.
ఇకపోతే వైరల్ అవుతున్న వీడియో కన్నా క్లారిటీ ఉన్న ఈ వీడియోలలో ట్రాక్టర్ వెనుక “Celik Aku” అని రాసి ఉన్న పసుపు రంగు బోర్డు గమనించొచ్చు. దీని ఆధారంగా వెతకగా “Celik Aku” అనేది టర్కీకి చెందిన బ్యాటరీ కంపెనీ అని తెలిసింది. ఈ ఆధారాల బట్టి ఈ వీడియో టర్కీకు చెందుంటుందని తెలుస్తుంది. ఐతే ఈ వీడియోకు సంబంధించిన వివరాల కోసం వీడియోను షేర్ చేసిన అకౌంట్‌ను మేము ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించాము, వారి వివరణ ఆధారంగా ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.
చివరగా, టర్కీకి చెందిన వీడియోను ఢిల్లీ నిరసనల్లో రైతులు మార్పులు చేసిన ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారని షేర్ చేస్తున్నారు.