Fake News, Telugu
 

రాజస్థాన్‌లో జరిగిన ఒక రెజ్లింగ్ టోర్నమెంట్ వీడియోను సేవ్ ఆరావళి నిరసనకు చెందిన దృశ్యాలని చెప్పి తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఆరావళి పర్వత శ్రేణుల్లో 100 మీటర్ల ఎత్తు ఉన్న వాటినే ఆరావళి పర్వతాలుగా గుర్తించబడతాయని సుప్రీంకోర్టు 20 నవంబర్ 2025న చెప్పింది. కేంద్ర ప్రభుత్వం వారి ఒక కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఆరావళి పర్వతాలకి ఇచ్చిన ఈ కొత్త నిర్వచనం కారణంగా, వాటిల్లో 90% పర్వతాలను ఆరావళిలో భాగం కాకుండా చేస్తుందని (అవి ఆరావళి రక్షణ నుంచి బయటకు వస్తాయని) కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). అయితే, సుప్రీంకోర్టు ఆరావళి పర్వతాలకి ఇచ్చిన ఈ కొత్త నిర్వచనం తర్వాత, ‘సేవ్ ఆరావళి’ అనే కాంపెయిన్ మొదలైంది, పర్యావరణ వేత్తలు ఈ నిర్ణయానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ). దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). మరో పక్క, ఆరావళి పర్వతాల్లో 90% శాతం వరకు రక్షణలోనే ఉన్నాయని 21 డిసెంబర్ 2025న కేంద్రం తెలిపింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

ఈ నేపథ్యంలో, పెద్ద ఎత్తున కొందరు ప్రజలు ఒక ప్రదేశంలో గుమిగూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఆరావళి పర్వతాల విద్వంసానికి వ్యతిరేకంగా రాజస్థాన్‌లో  జరిగిన ఒక నిరసనకు చెందిన దృశ్యాలని క్లెయిమ్ చేస్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆరావళి పర్వతాల విధ్వంసానికి వ్యతిరేకంగా రాజస్థాన్‌లో జరిగిన ఒక నిరసనను చూపిస్తున్న వీడియో ఇది. 

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో రాజస్థాన్‌లో జరిగిన ‘సేవ్ ఆరావళి’ నిరసనకు సంబంధించినది కాదు. రాజస్థాన్‌లోని కరిరి ఖాన్‌పూర్‌లో జరిగిన ఒక కుస్తీ పోటీకి సంబంధించిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

ముందుగా వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మాకు ఇదే వీడియో ఉన్న 31 ఆగస్టు 2025 నాటి ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లభించింది. ఈ వీడియో నవంబర్ 2025లో ప్రారంభమైన ఆరావళి పర్వతాల వివాదానికి ముందు నాటిది. ఈ పోస్ట్ యొక్క వివరణలో ఈ వీడియో రాజస్థాన్‌లోని మహ్వాలో ఉన్న కరిరి ఖాన్‌పూర్‌లో జరిగిన ఒక కుస్తీ టోర్నమెంట్‌కు సంబంధించినదని పేర్కొనబడింది.

ఆ తరువాత, ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లోని ఆధారాలను బట్టి, మేము తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, 31 ఆగస్టు 2025న ‘జగత్ తక్ న్యూస్’ అనే యూట్యూబ్ ఛానెల్‌లో “Todabhim: Kariri Ghazipur wrestling match | These two fought well till the very last moment.”, అనే శీర్షికతో అప్‌లోడ్ చేయబడిన ఒక వీడియో లభించింది. 

వీడియోలో ఈ కుస్తీ పోటీకి సంబంధించిన అనేక క్లిప్పులు ఉన్నాయి, ఇవన్నీ వైరల్ వీడియో తీసిన ప్రదేశంలోనే చిత్రీకరించినట్లు, ఈ వీడియోను సరిగ్గా చూడగా మాకు అర్థం అయింది. ఈ వీడియోలో, వైరల్ వీడియోలో కనిపిస్తున్న జనసమూహం, చుట్టుపక్కల భవనాలపై ఉన్న పోస్టర్‌లు అదే మాదిరిగా కనిపిస్తున్నాయి. ఈ రెండిటి మధ్య ఉన్న పోలికలను మీరు ఈ క్రింది ఫొటోలో చూడవచ్చు. 

చివరగా, ఒక రాజస్థాన్ రెజ్లింగ్ టోర్నమెంట్ వీడియోను సేవ్ ఆరావళి నిరసనకు చెందిన దృశ్యాలని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll