టీ కోసం ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులు గొడవ పడ్డారని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో ఒక మహిళ ఒక వ్యక్తిపై దాడి చేయడం చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఎయిర్ ఇండియా విమానంలో టీ కోసం ప్రయాణికులు గొడవ పడుతున్నప్పటి వీడియో.
ఫాక్ట్: ఇది ఫ్లై హై అనే ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ వారు అప్లోడ్ చేసిన ఒక స్క్రిప్టెడ్ ఎడ్యుకేషనల్ వీడియో, నిజమైన సంఘటన కాదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ వీడియో గురించి ఇంటర్నెట్లో వెతకగా ఇటువంటి ఘటన జరిగినట్లు విశ్వసనీయ మీడియా కథనాలు ఎక్కడా మాకు లభించలేదు. ఇక, వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియోని Fly high Institute Nagpur ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మూడు భాగాలుగా (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సెప్టెంబర్ 2025 రెండవ వారంలో అప్లోడ్ చేశారు.

‘ఫ్లై హై ఇన్‌స్టిట్యూట్’ వారి వెబ్సైట్, ఇన్‌స్టాగ్రామ్ బయో ప్రకారం ఈ సంస్థ ఏవియేషన్, హాస్పిటలిటీ, ట్రావెల్ & టూరిజం కోర్సులలో శిక్షణ చెప్తారు. వీరి సోషల్ మీడియా పేజీలలో విమాన ప్రయాణంలో కలిగే వివిధ సమస్యలను సిబ్బంది ఎలా ఎదుర్కొని పరిష్కరించాలో నేర్పించే స్క్రిప్టెడ్ వీడియోలు (ఇక్కడ, ఇక్కడ) ఉంటాయి.ఇందులో భాగంగానే వైరల్ వీడియోని కూడా రుతు రాంటేకే, దీపక్ కలాల్ అనే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌లతో వైరల్ వీడియోని రూపొందించారు. ఈ వీడియోని రుతు రాంటేకే, దీపక్ కలాల్ కూడా తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలలో షేర్ చేయడం చూడవచ్చు.

విమాన ప్రయాణాల్లో ఇతర ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించే వారితో సిబ్బంది ఎలా వ్యవహరించాలో ఈ వీడియో చూపుతుందని ‘ఫ్లై హై ఇన్‌స్టిట్యూట్’ వారు వీడియో వివరణలో పేర్కొన్నారు. గతంలో కూడా ఈ సంస్థ రుతు రాంటేకే, దీపక్ కలాల్, ఇతర సెలబ్రిటీలతో స్క్రిప్టెడ్ వీడియోలు చేసినప్పుడు అవి నిజమైన ఘటనలాగా సోషల్ మీడియాలో పలువురు షేర్ చేసినప్పుడు మేము రాసిన ఫాక్ట్-చెక్ కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, టీ కోసం ఎయిర్ ఇండియా ప్రయాణికులు గొడవ పడ్డారంటూ ఒక స్క్రిప్టెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.