పాత్రలో ఉంచబడిన ఒక వ్యక్తి తలని మరోవ్యక్తి సుత్తితో కొడుతున్నట్లుగా ఉన్న ఫోటో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. 1895లో తల నొప్పిని తగ్గించడానికి వైద్యులు ఈ పద్ధతిని అనుసరించేవారంటూ ఈ ఫోటోని షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: 1895లో తలనొప్పిని తగ్గించడానికి అనుసరించే చికిత్సా విధానాన్ని చూపే ఫోటో.
ఫాక్ట్: ఇది 19వ శతాబ్దంలో రూపొంచించబడిన ‘The Unlucky Present’ అనే ‘Magic Lantern’ ప్రదర్శనలోని ఒక సన్నివేశాన్ని చూపే ఒక చిత్రం. గతంలో తలనొప్పి నివారణకు ఈ పద్ధతిని వాడినట్లు ఆధారాలు లేవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, తలనొప్పి నివారణకు గతంలో ఇటువంటి చికిత్సా విధానాన్ని అనుసరించారా అని ఇంటర్నెట్లో వెతకగా మాకు ఎక్కడా కచ్చితమైన ఆధారాలు లభించలేదు.
ఇక వైరల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫొటో (ఆర్కైవ్) ‘Lucerna’ అనే వెబ్‌సైట్‌లో ఉన్నట్లు గుర్తించాం. 17వ శతాబ్దంలో కనుగొనబడిన Magic Lantern అనే ప్రొజెక్టర్ ద్వారా చూపించే ప్రదర్శనల యొక్క ఫోటో స్లయిడ్‌లు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

దీని ప్రకారం, వైరల్ ఫోటో ‘The Unlucky Present’ (ఆర్కైవ్) అనే ప్రదర్శనలోని ఒక సన్నివేశాన్ని చూపే స్లయిడ్‌కి సంబంధించినది.

19వ శతాబ్దంలో బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ ఆల్ఫ్రెడ్ పంఫ్రీ ఈ ప్రదర్శనను రూపొందించారు. ఈ కథలో ఒక వ్యక్తి తల ఇనుప పాత్రలో ఇరుక్కుపోతే, అతను కమ్మరి దగ్గరకు వెళ్లి ఏ విధంగా తన తలని బయటకి తెచ్చుకుంటాడో చూపించే హాస్యాస్పద సన్నివేశాన్ని ఈ స్లయిడ్ చూపిస్తుంది.

చివరిగా, వైరల్ ఫోటో తలనొప్పిని నివారించే ప్రాచీన పద్ధతికి సంబంధించినది కాదని, అది 19వ శతాబ్దపు ప్రదర్శనకి చెందిన చిత్రం అని నిర్ధారించవచ్చు.