ఒక విమానంలోని పైలట్ మైక్ ఆపడం మర్చిపోయి ఎయిర్ హోస్టెస్‌ను ముద్దు పెట్టుకుంటానని సహచర పైలట్ తో చెప్పాడని, ఈ సంగతి ప్రయాణికులు వినడంతో ఆ ఎయిర్ హోస్టెస్ సిగ్గుతో తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుందని చెప్తూ మూడు ఫోటోలు గల పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: పైలట్ తనని ముద్దు పెట్టుకుంటాడని పొరపాటుగా మైక్ లో చెప్పడంతో సిగ్గుపడుతున్న ఎయిర్ హోస్టెస్.
ఫాక్ట్: ఇది ఒక కల్పిత కథ. నిజమైన ఘటన కాదు. మొదటి ఫోటో 2014లో ఎయిర్ ఏషియా విమానంలో ఒక ప్రయాణికురాలు ఎయిర్ హోస్టెస్ ముఖంపై వేడి నీళ్లు పోసినప్పటి ఘటనను చూపుతుంది. రెండు, మూడు ఫోటోలు 2016లో రష్యన్ విమానంలో ఫుట్‌బాల్ అభిమానులు ఎయిర్ హోస్టెస్‌ను ఆటపట్టించగా ఆమె నవ్వినప్పుడు తీసినది. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటోలకు సంబంధించిన అసలైన వివరాలు మాకు లభించాయి. మొదటి ఫోటో 2014లో జరిగిన ఘటనకు సంబంధించినది కాగా రెండు, మూడు ఫోటోలు 2016లో జరిగిన మరో ఘటనకు చెందినవి. వైరల్ పోస్టులో చెప్తున్న కథకి వీటికి ఎటువంటి సంబంధం లేదు.
ఫోటో 1:
మీడియా కథనాల (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ప్రకారం, ఈ ఫోటో డిసెంబర్ 2014లో ఒక ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్‌పై దాడి చేసినప్పుడు తీయబడింది.

వివరాల ప్రకారం, బ్యాంకాక్ నుంచి నాన్జింగ్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానంలో ఒక చైనీస్ ప్రయాణికురాలికి ఎయిర్ హోస్టె హోస్టెస్‌తో గొడవ జరగగా, ఆ ప్రయాణికురాలు వేడి నీళ్లని ఎయిర్ హోస్టెస్ ముఖంపై పోసింది.

ఫోటోలు 2 & 3:
ఈ ఫోటోలు రష్యన్ విమాన సంస్థ ఏరోఫ్లోట్ విమానంలో 2016లో జరిగిన ఘటనను చూపుతుంది.

మీడియా కథనాల (ఇక్కడ & ఇక్కడ) ప్రకారం, ఒక ఎయిర్ హోస్టెస్ విమాన ప్రయాణానికి ముందు ప్రయాణికులకి భద్రతా సూచనలు చేస్తున్న సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న ఫుట్‌బాల్ అభిమానులు ఆమెను సరదాగా ఆటపట్టించగా, ఆమె నవ్వు ఆపుకోలేకపోయింది.

పై ఆధారాలను బట్టి, వైరల్ పోస్టులోని కథ కల్పితమైనదని, దానికి వైరల్ ఫొటోలతో సంబంధం లేదని స్పష్టమవుతుంది. చివరిగా, పైలట్ మైక్ ఆపడం మర్చిపోయి వ్యక్తిగత విషయాలను ప్రయాణికులకు చెప్పాడంటూ ప్రచారంలో ఉన్న ఈ పోస్టు ఫేక్.