Fake News, Telugu
 

ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టినందుకు యువరాజ్ సింగ్‌కు లలిత్ మోదీ ఒక 91 లక్షల పోర్షే బహుమానంగా ఇచ్చి, యువరాజ్ బ్యాటును 7 కోట్లకు వేలంలో అమ్మాడని ఒక తప్పుడు కథనం వైరల్

0

2007 క్రికెట్ ప్రపంచ కప్‌కి ముందు, ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన వారికి ఒక పోర్షే కారు ఇస్తానని లలిత్ మోదీ ఆటగాళ్లకి హామీ ఇచ్చాడని, యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టిన తర్వాత, లలిత్ మోదీ అతనికి 91 లక్షల రూపాయల కారును బహుమానంగా ఇచ్చాడని, తను ఆ బ్యాటుని 7 కోట్లకి వేలంలో అమ్మేసాడని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ లింక్ మీరు ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: 2007 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టినందుకు యువరాజ్ సింగ్‌కు లలిత్ మోదీ ఒక 91 లక్షల పోర్షే కారు బహుమానంగా ఇచ్చి, ఆ బ్యాటును 7 కోట్లకు వేలంలో అమ్మేశాడు. 

 ఫ్యాక్ట్ (నిజం): యువరాజ్ సింగ్‌ ఆరు సిక్సర్లు కొట్టిన ఆ బ్యాటు తన ఇంట్లో ఉందని లలిత్ మోదీ, రాజ్ షమాని, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టువర్ట్ క్లార్క్ చేసిన పోడ్కాస్ట్‌లలో చెప్పాడు. తను ఈ బ్యాటును 7 కోట్లకు వేలంలో అమ్మేసినట్లు మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, యువరాజ్ సింగ్ 2007 టీ-20 ప్రపంచ కప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టిన బ్యాట్‌ను లలిత్ మోదీ 7 కోట్ల రూపాయాలకు వేలం పాటలో అమ్మేసాడని చెప్తున్న ఎటువంటి వార్తా కథనాలు మాకు లభించలేదు. అలాగే, ఇప్పటి వరకు వేలంలో అమ్ముడు పోయిన (ఇక్కడ, ఇక్కడ) క్రికెట్ ఆటగాళ్ల బ్యాట్ కానీ, వేరే ఏ వస్తువు కానీ 7 కోట్లకు అమ్ముడు పోయినట్లు మాకు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. జాగరాన్ జోష్ వారి ఒక ఆగస్టు 2025 కథనం ప్రకారం ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ యొక్క ‘బ్యాగి గ్రీన్ కాప్’ 5.79 కోట్ల రూపాయలకు (ఒక మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు) వేలంలో అమ్ముడు పోయింది. ఒకవేళ యువరాజ్ బ్యాటు 7 కోట్లకు వేలంలో అమ్ముడు పోయి ఉంటే ఆ విషయాన్ని మీడియా తప్పకుండా రిపోర్టు చేసేది.

ఇక ఈ విషయంపై లలిత్ మోదీ ఏమని అన్నాడని తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, మాకు ఈ విషయాన్ని గురించి తను ‘Raj Shamani’ పోడ్కాస్ట్, ఆస్ట్రేలియా క్రికెటట్ స్టుయర్ట్ క్లార్క్ యొక్క పోడ్కాస్ట్‌లలో మాట్లాడాడని మాకు తెలిసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

2007 టీ-20 క్రికెట్ ప్రపంచ కప్‌ సమయంలో ఎవరైనా ఆటగాళ్లు ఒకే ఓవర్‌లో ఆరు వికెట్లు తీసినా, ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టినా, వాళ్లకు పోర్షే కారు బహుమతిగా ఇస్తానని తను భారత క్రికెట్ టీమ్‌కి చెప్పాడని, లలిత్ మోదీ నవంబర్ 2024 నాటి ‘Raj Shamani’ పోడ్కాస్ట్‌లో అన్నాడు.

ఆ తర్వాత, ఇంగ్లాండ్ మీద జరిగిన ఒక మ్యాచ్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టిన తర్వాత తన వైపుకి పరిగెత్తుకు వెళ్లి, నా పోర్షే ఏది అని అడిగాడట యువరాజ్. దానికి, లలిత్, నాకు ఆ బ్యాట్ ఇవ్వు అని బదులు ఇచ్చాడట. ఆ బ్యాట్ ఇప్పుడు తన ఇంట్లో ఉందని తను చెప్పారు. ఆ బ్యాటుతో లలిత్, రాజ్ షమాని దిగిన ఫోటో ఈ పోడ్కాస్ట్‌లో ఉంది, దీన్ని మీరు 51:28 మార్క్ దగ్గర చూడవచ్చు. 

ఇదే విషయాన్ని లలిత్ మోదీ, ఆగస్ట్ 2025 నాటి స్టువర్ట్ క్లార్క్ పోడ్కాస్ట్‌లో కూడా చెప్పాడు. యువరాజ్ ఆరు సిక్సులు కొట్టిన బ్యాటు లండన్‌లో ఉన్న తన గృహంలో ఉందని తాను ఇందులో పేర్కొన్నాడు. వైరల్ పోస్టులో చెప్తున్నట్టుగా, తను ఆ బ్యాటుని 7 కోట్లకి వేలంలో అమ్మానని చెప్పలేదు. 

చివరగా, 2007 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టినందుకు యువరాజ్ సింగ్‌కు లలిత్ మోదీ ఒక 91 లక్షల పోర్షే బహుమానంగా ఇచ్చి, ఆ బ్యాటును 7 కోట్లకు వేలంలో అమ్మేసాడని ఒక తప్పుడు కథనాన్ని షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll