Fake News, Telugu
 

ఈ వీడియోలో ఉన్నది నేపాల్ మాజీ ప్రధాని ఝాల నాథ్ ఖనాల్ భార్య రవి లక్ష్మి చిత్రకార్ కాదు

0

సోషల్ మీడియా నిషేధంతో నేపాల్‌లో మొదలైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో సుమారు 51 మంది వరకు మరణించారు. ఆందోళనకారులు ప్రముఖ ప్రభుత్వ భవనాలను, రాజకీయనాయకుల ఇళ్లను దాడి చేసి నిప్పంటించారు. సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేసినా కూడా ఆందోళనలు, నిరసనలు కొనసాగే సరికి నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ 9 సెప్టెంబర్ 2025న తన పదవికి రాజీనామా చేశారు.  

ఈ నేపథ్యంలో, నేపాల్ మాజీ ప్రధాని ఝాల నాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటిచ్చారని, ఆ సమయంలో తన సతీమణి రవి లక్ష్మి చిత్రకార్ (వైరల్ పోస్టులలో రాజ్యలక్ష్మి చిత్రకార్ అని రాశారు) ఇంట్లో ఉండటం వల్ల ఆమె మంటల్లో చిక్కుకొని మరణించారని చెప్తూ, సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేయబడుతోంది. ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థలు కూడా రిపోర్ట్ చేశాయి (ఇక్కడ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నేపాల్ మాజీ ప్రధాని ఝాల నాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించడం వల్ల ఆయన భార్య రవి లక్ష్మి చిత్రకార్ సజీవ దహనం అయ్యారు. 

ఫ్యాక్ట్ (నిజం): రవి లక్ష్మి చిత్రకార్ ఆందోళనకారుల దాడిలో గాయాలపాలయ్యి  ‘కీర్తిపూర్ బర్న్ హాస్పిటల్’లో చికిత్స పొందుతున్నారు. తను మరణించలేదు, తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని  ఆసుపత్రి యాజమాన్యం నేపాలీ మీడియాకి తెలిపింది. అలాగే, తను ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అని ఝాల నాథ్ ఖనాల్ BBCకి తెలిపారు. వైరల్ వీడియోలో కనిపిస్తున్న మహిళ, నేపాల్ యొక్క ప్రస్తుత విదేశాంగ మంత్రి ఆర్జూ రానా దేవ్‌బా, రవి లక్ష్మి చిత్రకార్ కాదు. ఆమె నేపాల్ మాజీ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్‌బా సతీమణి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, నేపాల్ మాజీ ప్రధానమంత్రి ఝాల నాథ్ ఖనాల్ (CPN (Unified Socialist) leader) భార్య రవి లక్ష్మి చిత్రకార్ ఆందోళనకారులు చేసిన దాడిలో గాయాలపాలయ్యారని, అయితే తను ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రిపోర్ట్ చేసిన కొన్ని నేపాలీ మీడియా కథనాలు మాకు దొరికాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

తన భార్య ఆరోగ్య పరిస్థితి గురించి BBC నేపాల్ ప్రతినిధితో ఝాల నాథ్ ఖనాల్ మాట్లాడుతూ (ఇక్కడ, ఇక్కడ), రవి లక్ష్మి చిత్రకార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం వెంటిలేటర్ పైన ఉన్నారని చెప్పారు (ఇక్కడ, ఇక్కడ). 

ఆవిడ  ‘కీర్తిపూర్ బర్న్ హాస్పిటల్’లో చికిత్స పొందుతున్నారని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ). కొన్ని వార్తా కథనాలు ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది అని చెప్పగా, BBC నేపాల్, The Kathmandu Post వారి కథనాల ప్రకారం, రవి లక్ష్మి చిత్రకార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 

అయితే, వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు, రవి లక్ష్మి చిత్రకార్ గురించి ప్రచురితమైన మీడియా కథనాల్లో లేవు. ఆ వీడియో గురించి మేము అందులో ఉన్న కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ నేపాల్ మరో మాజీ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్‌బా సతీమణి, నేపాల్ యొక్క ప్రస్తుత విదేశాంగ మంత్రి ఆర్జూ రానా దేవ్‌బా. ఈమెను, తన భర్తను నేపాల్ ఆందోళనకారులు వారి ఇంటికి వెళ్లి కొట్టారు. వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలు వీరిద్దరినీ ఆందోళనకారులు కొట్టినప్పుడు తీసినవి అని రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలను మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 

చివరగా, నేపాల్ మాజీ ప్రధాని ఝాల నాథ్ ఖనాల్ భార్య రవి లక్ష్మి చిత్రకార్ నేపాల్‌ ఆందోనలలో మరణించారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది, ఈ వీడియోలో ఉన్నది నేపాల్ మాజీ ప్రధాని ఝాల నాథ్ ఖనాల్ భార్య రవి లక్ష్మి చిత్రకార్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll