హైదరాబాద్ నగర పరిధిలో విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం 2024లో స్వతంత్ర సంస్థగా ఏర్పాటైన హైడ్రాకి (HYDRAA) సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్తూ ఒక న్యూస్ పేపర్ క్లిప్ వంటి పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులను హైడ్రా పరిధి నుంచి మినహాయిస్తున్నట్లు రేవంత్ రెడ్డి 18 జూలై 2025న మీడియా సమావేశంలో ప్రకటించారని ఈ పోస్టులో చెప్పబడింది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులను హైడ్రా పరిధి నుంచి మినహాయిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారని చెప్తున్న న్యూస్ పేపర్ క్లిప్.
ఫాక్ట్: ఇది ఒక నకిలీ న్యూస్ పేపర్ క్లిప్. రేవంత్ రెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. అలాగే, ఇది అసత్య ప్రచారం అని, హైడ్రా నుంచి ఎవరికి మినహాయింపు లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, హైడ్రా పరిధి నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులను మినహాయిస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఎక్కడా అధికారిక ప్రకటన కానీ, విశ్వసనీయ వార్తా కథనాలు కానీ లభించలేదు. అలాగే, వైరల్ పోస్టులో ఉన్న ఫోటో కూడా తెలంగాణలో అంగన్‌వాడీల అభివృద్ధికి సంబంధించి 30 జూన్ 2025న జరిగిన సమావేశానికి చెందినది. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి మీడియాతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆధారాలు లేవు.

ఇక వైరల్ న్యూస్ పేపర్ క్లిప్‌ని పరిశీలించగా, ఇది ‘అంధజ్యోతి’ అనే పత్రిక పేరుతో ఉంది. ఈ పేరుతో ఎటువంటి పత్రిక లేదు. అలాగే, ఈ పేరుకు దగ్గరలో ఉన్న ‘ఆంధ్రజ్యోతి’ కూడా ఈ వార్తను ప్రచురించినట్లు ఆధారాలు లేవు. దీన్ని బట్టి, వైరల్ పేపర్ క్లిప్ నకిలీదని చెప్పవచ్చు.

అలాగే, ఇది తప్పుడు సమాచరాన్ని వ్యాప్తి చేసే నకిలీ పేపర్ క్లిప్ అని, హైడ్రా పరిధి నుంచి ఎవరికీ మినహాయింపు లేదని, ఇటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ ఫాక్ట్-చెక్ విభాగం (ఆర్కైవ్) పేర్కొంది.
చివరిగా, హైడ్రా పరిధి నుంచి శాసనసభ్యులను మినహాయించారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు.