ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య సీజ్ ఫైర్ (కాల్పుల విరమణ) ఒప్పందం కుదిరిందని భారత ప్రభుత్వం 10 మే 2025న ప్రకటించింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). పాకిస్తాన్ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత్ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌కు 10వ తేదీన 3:35 గంటలకు ఫోన్ చేశారని, ఇరువైపుల జరుగుతున్న కాల్పులు భారతీయ కాలమానం ప్రకారం 10 మే సాయంత్రం 5:00 గంటలకు విరమించుకోవాలని వారిరువురూ ఒక ఒప్పందానికి వచ్చారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. అయితే, దీన్ని ఉల్లంఘిస్తూ సీజ్ ఫైర్(కాల్పుల విరమణ) ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే పాకిస్థాన్ భారత్‌పై కాల్పులు జరిపిందని భారత ప్రభుత్వం తెలిపింది (ఇక్కడ, ఇక్కడ). భారతీయ సాయుధ దళాలు ఈ ఉల్లంఘనకు తగిన జవాబు ఇస్తున్నారని విక్రమ్ మిశ్రి ప్రకటించారు.
11 మే 2025న భారత త్రివిధ దళాల అధికారుల ‘ప్రెస్ మీట్’ నిర్వహించి, ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు తెలియజేశారు (ఇక్కడ). ఈ మీడియా సమావేశంలో భారత ఆర్మీ డీజీఎంఓ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఎ.కె. భారతి, వైస్ అడ్మిరల్ ప్రమోద్ పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో పాకిస్థాన్ భూభాగంపై భారత దళాలు చేసిన దాడులకు సంబంధించిన వివరాలను వీడియోలు, షాటిలైట్ చిత్రాలతో సహా వెల్లడించారు. ఈ సమావేశంలో ఎయిర్ మార్షల్ ఎ.కె. భారతి మాట్లాడుతూ, భారత వైమానిక దళం బహవల్పూర్, మురుద్కే ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించిందని అన్నారు. దాడులకు ముందు ఆ తర్వాత ఘటనాస్థలి దృశ్యాలను ఏకే భారతి తెరపై ప్రదర్శిస్తూ ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను వివరించారు. పాకిస్తాన్ డ్రోన్లతో భారతదేశంపై దాడి చేసిందని, అయితే భారతదేశం వాటిని ఆవలే ధ్వంసం చేసిందని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ దాడులకు ప్రతి చర్యగా లాహోర్, గుజ్రన్‌వాలా, సర్‌గోదా, రహీర్‌యార్‌ఖాన్, చక్‌లాలా (నూర్ ఖాన్), సకర్, భొలారీ, జకోబాబాద్ ఎయిర్‌బేస్‌లను, రాడార్ సెంటర్లను భారత్ ధ్వంసం చేసిందని ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో, పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్ ప్రాంతంలోని అణ్వాయుధ నిల్వ స్థావరంపై భారత్ దాడి చేసినందువల్ల రేడియేషన్ లీక్ అయ్యిందని, ఈ విషయాన్ని అంగీకరిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ఒక లేఖని విడుదల చేసిందంటూ ‘జాతీయ రేడియోలాజికల్ భద్రతా విభాగం’ పేరుతో ఒక లేఖ (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: పాకిస్తాన్‌లోని కినారా హిల్స్ ప్రాంతంలోని అణ్వాయుధ నిల్వ స్థావరం నుంచి రేడియేషన్ లీక్ అయినట్లు అంగీకరిస్తూ పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక లేఖని విడుదల చేసింది.
ఫాక్ట్: ఇదొక నకిలీ లేఖ. కినారా హిల్స్ ప్రాంతంలో రేడియేషన్ లీక్ అవుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా, ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా, రేడియేషన్ లీక్‌ను అంగీకరిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం లేదా సంబంధిత మంత్రిత్వ శాఖలు కానీ ఎటువంటి అధికారిక ప్రకటనను విడుదల చేసినట్లు ఆధారాలు లభించలేదు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ అంతర్జాతీయ మీడియా ఎక్కడా కథనాలను ప్రచురించలేదు.
ఇక, కిరానా కిరానా హిల్స్ ప్రాంతంలోని అణ్వాయుధ నిల్వ స్థావరంపై భారత్ దాడి చేసిందా లేదా అని 12 మే 2025న జరిగిన మీడియా సమావేశంలో ఎయిర్ మార్షల్ ఏకే భారతిని విలేఖరులు అడగగా, తాము కిరానా హిల్స్ ప్రాంతంపై దాడి చేయలేదని ఆయన చెప్పారు.
అలాగే, రేడియేషన్ లీక్‌పై జరుగుతున్న చర్చ నేపథ్యంలో అమెరికా పాకిస్తాన్‌కు బృందాన్ని ఏమైనా పంపిందా అని 14 మే 2025న అడగగా, దీనిపై ప్రస్తుతం చెప్పడానికి ఏమీ లేదని, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి పేర్కొన్నారు.
ఇక వైరల్ అవుతున్న లేఖ విషయానికి వస్తే, ఇందులో అనేక తప్పులు ఉండడం చూడవచ్చు. అలాగే, లేఖలో పేర్కొన్న “National Radiological Safety Division” అనే పేరుతో ఎటువంటి విభాగం ఉన్నట్లు మాకు ఆధారాలు లభించలేదు. లేఖ చివర్లో ఈ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా చెప్పబడిన మాలిక్ అసద్ రఫీక్ గురించి కూడా ఎటువంటి వివరాలు లభించలేదు. పాకిస్తాన్‌లో అణుశక్తి, రేడియోధార్మిక వనరులు మరియు రేడియేషన్‌కు సంబంధించిన విషయాలను పాకిస్తాన్ అణు నియంత్రణ సంస్థ(PNRA) పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థకి ఫైజన్ మన్సూర్ చైర్మన్ గా వహిస్తున్నారు.

పైగా, ఈ లేఖలో ఇవ్వబడిన ఈ-మెయిల్ ‘nrsd@env.go.v.pak’ కూడా అందుబాటులో లేదని తెలిసింది. సాధారణంగా, పాక్ ప్రభుత్వ ఈ-ఈమెయిల్ అడ్రస్లు ‘.gov.pk’ తో ముగుస్తాయి. పై ఆధారాలను బట్టి, వైరల్ అవుతున్న లేఖ ఫేక్ అని నిర్ధారించవచ్చు.

చివరిగా, పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్ ప్రాంతంలో రేడియేషన్ లీక్ అవుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించినట్లు ప్రచారంలో ఉన్న లేఖ ఫేక్.