“బీసీలకు 42% రిజర్వేషన్‌లు ఇవ్వకుండా అడ్డుకుంటాం అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు” అని అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బీసీలకు 42% రిజర్వేషన్‌లు ఇవ్వకుండా అడ్డుకుంటాం అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 27 జూలై 2025న కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాలను చూపిస్తుంది. ఈ మీడియా సమావేశంలో, బీజేపీ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, “తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలని చూస్తున్నదని, బీసీల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లను పెంచే కుట్ర చేస్తుంది, బీసీలకే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే మద్దతిస్తాము, లేకపోతే దీన్ని కచ్చితంగా అడ్డుకుంటాం” అని అన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వైరల్ వీడియో యొక్క అధిక నిడివి గల వీడియో ఒకటి లభించింది. ఈ వీడియోను తెలుగు వార్త సంస్థ ‘Zee Telugu News’ 27జూలై 2025న,“ Bandi Sanjay Sensational Comments On CM Revanth Over BC Reservation | ఇది బీసీ డిక్లరేషన్ కాదు..” అనే శీర్షికతో షేర్ చేసింది. ఈ వీడియోలో, బీజేపీ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. “రాష్ట్రంలో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇప్పుడు అదనంగా బీసీలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ.. ఆ ముసుగులో 10 శాతం జనాభా ఉన్న ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అంటే తెలంగాణలో ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నారు. అట్లాంటప్పుడు అది బీసీ డిక్లరేషన్ ఎట్లా అవుతుంది? అది ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనే” అని పేర్కొన్నారు.
వాస్తవంగా ఈ మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, “తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలని చూస్తున్నదని, బీసీల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లను పెంచే కుట్ర చేస్తుంది, తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర జరుగుతున్నదని, ఈ ముస్లిం డిక్లరేషన్ అనే విష వృక్షాన్ని అడ్డుకోకపోతే దేశమంతా విస్తరించే ప్రమాదం ఉందని, బీసీలకే 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే మద్దతిస్తాము, లేకపోతే దీన్ని కచ్చితంగా అడ్డుకుంటాం” అని అన్నారు. ఈ మీడియా సమావేశానికి సంబంధించిన పలు వార్తా కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. కాంగ్రెస్ పార్టీ చేసిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు సంబంధించిన వివరాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, బీసీలకు 42% రిజర్వేషన్‌లు ఇవ్వకుండా అడ్డుకుంటాం అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేర్కొనలేదు.