పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని మోతబారి ప్రాంతంలో 27 మార్చి 2025న మతపరమైన అల్లర్లు జరిగాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్‌లో కొందరు రోడ్లపై ఉన్న వాహనాలకి నిప్పంటిస్తున్న దృశ్యాలు అని క్లెయిమ్ చేస్తూ, సోషల్ మీడియాలో ఒక వీడియోనను షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ). అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఈ వీడియో పశ్చిమ బెంగాల్‌లో మాల్డా జిల్లాలోని మోతబారి ప్రాంతంలో మార్చ్ 2025లో జరిగిన హింసను చూపిస్తుంది.
ఫ్యాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన మతపరమైన అల్లర్లకి ఎటువంటి సంబంధం లేదు. ఇది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నిర్వహించిన ఒక నిరసన సందర్భంగా 26 నవంబర్ 2023 రాత్రి బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ నగరంలో జరిగిన విధ్వంసాన్ని చూపిస్తుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
ఈ వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, మేము వీడియోలోని కీఫ్రేమ్‌లను ఉపయోగించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించాము. ఈ సెర్చ్ ద్వారా మాకు 27 నవంబర్ 2023న బంగ్లాదేశ్ మీడియా సంస్థ ‘ప్రోథోమ్ అలో’ YouTubeలో అప్లోడ్ చేసిన వీడియో ఒకటి లభించింది. ఇందులో(ఆర్కైవ్ లింక్) వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలు ఉన్నాయి. వీడియోలోని వివరణ ప్రకారం, ఇది బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ నగరంలో జరిగింది.
వైరల్ వీడియో, బంగ్లాదేశ్ న్యూస్ రిపోర్ట్ మధ్య పోలికను మీరు క్రింద చూడవచ్చు.

దీని తర్వాత, మేము ఒక గూగుల్ కీవర్డ్ సెర్చ్ నిర్వహించగా, 26 నవంబర్ 2023న ప్రచురించబడిన ఒక వార్తా కథనం మాకు లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ వీడియో, అప్పుడు ఆ దేశంలో చేపట్టిన ఒక బ్లాకేడ్( రోడ్డు, రైలు, నీటి మార్గాల దిగ్బంధం)కు మద్దతుగా, సిల్హెట్‌లో BNP (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) నిర్వహించిన ఒక టార్చిలైట్ ఊరేగింపును చూపిస్తుంది.
ఈ ఊరేగింపు సందర్భంగా అనేక వాహనాలను ధ్వంసం చేసి, తగలబెట్టారని ఈ కథనం పేర్కొంది పేర్కొంది. ఈ సంఘటన 26 నవంబర్ 2023న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సుబిద్ బజార్ ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనపై వచ్చిన మరో వార్తా కథనాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.
దీన్ని క్లూగా తీసుకొని, వైరల్ వీడియోలో కనిపిస్తున్న లోకషన్‌ను Google Maps ఉపయోగించి మేము జియోలొకేట్ చేసాము. వైరల్ వీడియో లొకేషన్ మరియు Google Mapsలో స్థానం మధ్య పోలికను మీరు క్రింద చూడవచ్చు.

అదనంగా, వైల్ వీడియోకు సంబంధించి పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇచ్చిన వివరణ ఒకటి మాకు ‘X’లో లభించింది. వైరల్ వీడియోకు గురించి మాట్లాడుతూ, ఈ వీడియో నవంబర్ 2023లో బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ ప్రాంతంలో జరిగిన సంఘటనను చూపిస్తుందని, 27 మార్చి 2025న మాల్డాలో జరిగిన హింసతో దీనికి ఎటువంటి సంబంధం లేదని పశ్చిమ బెంగాల్ పోలీసులు పేర్కొన్నారు. ఈ సమాచారం అంతటినీ బట్టి చూస్తే, వైరల్ వీడియో పశ్చిమ బెంగాల్‌లో తీసింది కాదని, బంగ్లాదేశ్‌కు చెందినది అని మనకు అర్థం అవుతుంది.
చివరగా, బంగ్లాదేశ్‌లో 2023లో జరిగిన ఒక సంఘటనకు చెందిన వీడియోను పశ్చిమ బెంగాల్‌కు ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు.