రాజస్థాన్‌లో అజ్మల్ ఖాన్ అనే ముస్లిం యువకుడు ఒక హిందూ అమ్మాయిని పెళ్లి పేరుతో వేధించి, అడ్డు వచ్చిన అమ్మాయి కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేశాడని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో ఎంత నిజముందో నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్ టిప్‌లైన్‌కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: రాజస్థాన్‌లో హిందూ కుటుంబాన్ని హత్య చేసిన అజ్మల్ ఖాన్ అనే ముస్లిం యువకుడు.
ఫాక్ట్: ఈ వీడియో 2021లో రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోని ఖర్వా గ్రామంలో జరిగిన సంఘటనకు సంబంధించినది. నిరుద్యోగం, ఆర్థిక సమస్యల కారణంగా అజిత్ చీతా అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలను చంపి, తన భార్యను గాయపరిచాడు. అజిత్ చీతా హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఉండే చీతా మెహ్రత్ వర్గానికి చెందినవాడు. తాను ముస్లిం అని అజిత్ ప్రకటించుకున్నాడు. ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదని పోలీసులు పేర్కొన్నారు. కావున పోస్టులో చేయబడ్డ తప్పు.
ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చూపుతున్న వీడియో ఒకటి 14 జూలై 2021న సోషల్ మీడియా లభించింది. అజ్మీర్ జిల్లాలోని ఖార్వా గ్రామంలో నివసిస్తున్న ఒక వ్యక్తి తన నిరుద్యోగ సమస్య కారణంగా తన ఇద్దరు కుమార్తెలను విషాదకరంగా చంపాడని ఆ యూజర్ ఆ వీడియోను ప్రచురించాడు.

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పత్రిక, దైనిక్ భాస్కర్, ఇతర మీడియా సంస్థలు జూలై 2021న వార్తా కథనాలని ప్రచురించాయి. వీటి ప్రకారం, 14 జూలై 2021న ఖర్వా గ్రామంలోని భవానీపుర కాలనీకి చెందిన అజిత్ చీతా నిరుద్యోగం, ఆర్థిక సమస్యల కారణంగా తన ఇద్దరు కుమార్తెల గొంతు కోసి, తన భార్యను గాయపరిచాడు. అజిత్ తన కుటుంబంపై దాడి చేసి తనను తాను గాయపరచుకున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటన తర్వాత స్థానికులు అజిత్ చీతాను బీవర్ సదర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఒక కుమార్తె అక్కడికక్కడే మరణించగా, మరొక కుమార్తె ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించింది.

ఈ సంఘటనకు సంబంధించి 14 జూలై 2023న దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని అజ్మీర్ పోలీసులు ప్రచురించారు. ఇందులో నిందితుడి పేరు అజిత్ చీతా అని పేర్కొనబడింది. అజిత్ చీతా హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఉండే చీతా మెహ్రత్ వర్గానికి చెందినవాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, అజిత్ కుటుంబంలో హిందూ బంధువులు ఉన్నారు. అయితే, తాను ముస్లిం అని అజిత్ ప్రకటించుకున్నాడు. ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని క్వింట్‌తో మాట్లాడుతూ, బీవర్ సదర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి సురేంద్ర సింగ్ జోధా ధృవీకరించారు.

చివరిగా, 2021లో రాజస్థాన్‌లో ఒక వ్యక్తి తన ఇద్దరు కూతుర్లని చంపిన ఘటనకి సంబంధించిన వీడియోని మతపరమైన కోణంలో షేర్ చేస్తున్నారు.