రాజస్తాన్ లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళకి ప్రధానమంత్రి కార్యాలయం ‘జాతీయ సహాయ నిధి’ నుండి 30 లక్షల సహాయం చేసారని చెప్తూ ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): తన కూతురి వైద్యానికి సహాయం కోసం ప్రధానమంత్రి మోడీకి లెటర్ రాసిన రాజస్తాన్ కి చెందిన సుమేర్ సింగ్. ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ ద్వారా 30 లక్షల రూపాయులు సహాయం చేసిన ప్రధానమంత్రి కార్యాలయం. ఆ డబ్బుతో తన కూతురి ఆరోగ్యాన్ని సుమేర్ సింగ్ బాగుచేయించాడు..
ఫాక్ట్ (నిజం): ప్రధాన మంత్రి కార్యాలయం సహాయం చేసింది 3 లక్షలు మాత్రమే, 30 లక్షలు కాదు. సుమేర్ సింగ్ కూతురు ఇప్పటికీ వ్యాధితో బాధపడుతుంది. కావున పోస్ట్ లో 30 లక్షల సహాయం అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్ లోని విషయాల గురించి గూగుల్ లో ‘30 lakhs help by PM Modi’ అని వెతకగా, చాలా వార్తాపత్రికలు మోడీ 30 లక్షల రూపాయులు సహాయం చేసినట్టు ప్రచురించాయని తెలుస్తుంది.
కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) ఆర్టికల్ లో మాత్రం ప్రధాన మంత్రి కేవలం 3 లక్షల సహాయం చేసినట్టు ఉంటుంది. ఆ ఆర్టికల్ లో వివరాలు చూడగా సుమేర్ సింగ్ TOI తో మాట్లాడుతూ గత సంవత్సరం సహాయం కోసం ఎం.పీ. రన్వీర్ సింగ్ ద్వారా PMO కి లెటర్ పంపించగా, వాళ్ళు 3 లక్షల సహాయం చేసారని చెప్పినట్టు తెలుస్తుంది. అంతే కాదు, సోషల్ మీడియా లో వైరల్ అవుతునట్టుగా తనకు 30 లక్షల సహాయం అందినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇలాంటి ఫేక్ వార్తల వల్ల సహాయం కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలుగుతుందని సుమేర్ సింగ్ అన్నాడు.
TOI జర్నలిస్ట్ అరవింద్ చౌహాన్ తన ట్విట్టర్ అకౌంట్ లో PMO 3 లక్షలు మంజూరు చేస్తూ ఇచ్చిన లేఖని ట్వీట్ చేసాడు. ఆ లేఖలో కూడా కేవలం 3 లక్షలు మంజూరు అయినట్టు చూడవచ్చు. అరవింద్ ఇంకో ట్వీట్ లో సుమేర్ సింగ్ కూతురు మాట్లాడిన వీడియో పెట్టాడు. దాంట్లో సుమేర్ సింగ్ కూతురు లలిత మాట్లాడుతూ తన కుటుంబం ఇప్పటికే తన వైద్యం కోసం చాలా కష్టపడ్డారని, ప్రభుత్వం సహాయం చేయలేకపోతే కనీసం తను చనిపోవడానికి అయిన అనుమతి ఇవ్వాలని అంటుంది.
This is god damn irony, that Lalita who needs immediate financial help of Rs 7 lakh for bone marrow transplant, will face delay, as certain media section have wrongly reported that @PMOIndia has given Rs 30 lakh to her father, but instead only Rs 3 lakh was wired. @zoo_bear pic.twitter.com/5GQlmr0si9
— Arvind Chauhan (@arvindcTOI) June 23, 2019
ఈ విషయంపై వివరణ కొరకు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) లోని జాతీయ సహాయ నిధి (PMNRF) ఆఫీసుకి FACTLY ఫోన్ చేసి మాట్లాడగా, తాము 3 లక్షలు మాత్రమే మంజూరు చేసామని వారు తెలిపారు. అంతే కాదు, సాధారణంగా, ఇలాంటి కేసులలో గరిష్టంగా 3 లక్షల వరకే ఇస్తామని PMNRF ఆఫీసు వారు తెలిపారు.
చివరగా, PMO చేసిన 3 లక్షల సహాయాన్ని 30 లక్షల సహాయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సుమేర్ సింగ్ కూతురు ఇప్పటికీ వ్యాధితో బాధపడుతుంది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?