Fake News, Telugu
 

హెల్ప్ లైన్ నెంబర్ 9969777888 ని ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ వారు మహిళల రక్షణ కోసం నెలకొల్పలేదు

0

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ వారు మహిళల రక్షణ కోసం మంచి సర్వీస్ ప్రారంభించారు .. మీరు ప్రయాణించే కార్.. క్యాబ్.. ఆటో.. నెంబర్ ని 9969777888 కు ఎస్ఎంఎస్ చేయండి… మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది.. అంటే మీరు ప్రయాణించే వాహనం జిపిఆర్ఎస్ కు అనుసంధానం అవుతుంది.. మరింత మంది ఆడపడుచులకు ఈ మెసేజ్ అందే వరకు పంపించండి..” అంటూ ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఆంధ్ర ప్రదేశ్ పోలీసు వారు తమ రాష్ట్ర మహిళల భద్రత కోసం వారు ప్రయాణించే వాహనాలను GPRS ట్రాకింగ్ చెయ్యడానికి 9969777888 అనే హెల్ప్ లైన్ నెంబర్ ని ప్రారంభించారు.

ఫాక్ట్ (నిజం): ముంబై పోలీసులు 2014లో ఆ నగర మహిళల భద్రత కోసం హెల్ప్ లైన్ నెంబర్ 9969777888 ని నెలకొల్పారు. కానీ, 2017లో దాని సేవలు నిలిపివేయడం వలన అది ఇప్పుడు ఎక్కడా కూడా వాడుకలో లేదు. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.  

గూగుల్ లో హెల్ప్ లైన్ నెంబర్ “9969777888” గురించి వెతికినప్పుడు, ఆ హెల్ప్ లైన్ ని 2014లో ముంబై పోలీసు వారు తాము చేపట్టిన ‘Travel Safe When Alone’ అనే కార్యక్రమంలో భాగంగా మొదలుపెట్టారని “The Indian Express” వార్తా సంస్థ ప్రచురించిన కథనం ద్వారా తెలిసింది. రాత్రుల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలు తాము ప్రయాణిస్తున్న ఆటో లేదా టాక్సీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్‌ను 9969777888 కు SMS చేసినట్లయితే, అది వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులకు  GPS ద్వారా ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది.

అయితే మహిళా వినియోగదారుల నుండి సరైన స్పందన లేకపోవడంతో ముంబై పోలీసులు ఈ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ సేవలను 2017లో నిలిపివేశారని “Mid-day.com” వారు ప్రచురించిన ఒక కథనం ద్వారా తెలిసింది.

ఈ హెల్ప్ లైన్ నెంబర్ గురించి గతంలో కూడా అనేక నగరాల్లో ప్రచారం జరిగినప్పుడు, అలాంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆ నగర పోలీస్ శాఖ వారు ట్వీట్ల ద్వారా తెలిపారు.

చివరగా, హెల్ప్ లైన్ నెంబర్ 9969777888 ని ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ వారు తమ రాష్ట్రం లో వాహనాల్లో ప్రయాణించే మహిళల రక్షణ కోసం నెలకొల్పలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll