Fake News, Telugu
 

పోస్ట్ లోని ఫోటో రాహుల్ గాంధీ వయనాడ్ ప్రచారానికి సంబంధించినది కాదు , అందులో ఉన్న జెండాలు పాకిస్థాన్ దేశానివి కావు

1

కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ  పార్లమెంట్ ఎన్నికలు-2019 కి కేరళ రాష్ట్రం లోని వాయనాడ్ పార్లమెంటరీ స్థానం నుండి పోటీ చేస్తాను అని ప్రకటించినప్పటి నుండి ఆయన పై సోషల్ మీడియాలో అనేక ఆరోపణలతో కూడిన పోస్ట్ లు ప్రచారం అవుతున్నాయి. ఒక పోస్ట్ లో కార్యకర్తలు పచ్చని జెండాలు ఉపుతున్న ఫోటోని పెట్టి, ఆ ఫోటోలో ఉన్నది పాకిస్థాన్ జెండాలు అని, ఆ చిత్రం రాహుల్ గాంధీ వయనాడ్ ప్రచారానికి సంబంధించినది అని ఆరోపిస్తున్నారు. ఆ పోస్ట్ లో పెట్టిన విషయాలు ఎంతవరకు వాస్తవమో ఓసారి విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్ (దావా): పోస్ట్ లో ఉన్న ఫోటో రాహుల్ గాంధీ వయనాడ్  ప్రచారానికి సంబంధించినది, అందులో ఉన్న జెండాలు పాకిస్థాన్ దేశ జాతీయ జెండాలు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్నది  2017 సంవత్సరానికి సంబంధించిన ఫోటో. ఆ ఫోటో కి రాహుల్ గాంధీ గారి ప్రస్తుత వాయనాడ్ ప్రచారానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ ఫోటోలో ఉన్న జెండాలు కేరళ రాష్ట్రంలో ప్రాభల్యం ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీకి చెందినవి. కావున, పోస్ట్ లో పేర్కొన్న ఆరోపణలు అవాస్తవాలు.

పోస్ట్ లో ఉన్న ఫోటో ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది మే 5, 2017 న ప్రచురితం అయిన ఒక మలయాళం వార్తా  సంస్థకి సంబంధించిన కథనం లో లభించింది. ఆ ఫోటో కి రాహుల్ గాంధీ గారి వాయనాడ్ ప్రచారానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ ఫోటో లో ఉన్న జెండాలు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీవి. ఆ పార్టీ జెండాలు , పాకిస్థాన్  దేశ జాతీయ జెండాకి  సరిపోలినట్టుగా ఉండడం తో కొంత మంది ఈ రకమైన తప్పుడు ప్రచారం చేసి జనాలను తప్పుద్రోవ పట్టిస్తున్నారు .

చివరగా , ఫేస్బుక్ లో  వ్యాప్తి లో ఉన్న ఫోటో రాహుల్ గాంధీ వయనాడ్  ప్రచారానికి సంబంధించినది కాదు , అందులో ఉన్న జెండాలు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీకి  చెందినవి.

Share.

About Author

1 Comment

scroll