ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి భారత దేశంలో జరుగుతున్న హత్యలు మరియు మానభంగాల గురించి చెప్తూ కన్నీరు పెట్టుకున్నాడని చెప్తూ ఒక వీడియోని ఫేస్బుక్ లో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): భారత దేశంలో జరుగుతున్న హత్యలు మరియు మానభంగాల గురించి కన్నీరు పెట్టుకున్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి.
ఫాక్ట్ (నిజం): ఐక్యరాజ్య సమితికి సెక్రెటరీ జనరల్ ఉంటాడు. వీడియో లోని వ్యక్తి పేరు మాలిక్ నదీం అబిద్. తను ఎప్పుడూ ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ గా పనిచేయలేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
పోస్ట్ లోని వీడియోని ఇన్విడ్ ప్లగిన్ సహాయంతో ఫ్రేమ్స్ గా విభజించి గూగుల్ లో వెతకగా, వీడియో లో ఉన్న వ్యక్తి పేరు మాలిక్ నదీం అబిద్ అని తెలుస్తుంది. తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ లో ఉన్న వీడియోనే (రాతలు లేకుండ) పెట్టుకున్నాడు. తన ట్విట్టర్ మరియు ఫేస్బుక్ అకౌంట్లలో తన గురించి చూడగా తను ‘International Human Rights Commission – Relief Fund Trust’ అనే NGO సంస్థకు సెక్రెటరీ జనరల్ అని ఉంటుంది. ఆ సంస్థ కి ఐక్యరాజ్య సంస్థ కేవలం ‘Consultative Status’ మాత్రమే ఇచ్చిందని దాని ఫేస్బుక్ పేజీ లో ఉంటుంది. అంతే కాదు ‘IHRC-Relief Fund Trust’ ఫేస్బుక్ పేజీ లో దాని గురించి చూడగా దాని బేస్ అంత పాకిస్తాన్ లో ఉందని తెలుస్తుంది. అంతే కాదు, మాలిక్ గురించి మరింత వెతకగా తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో తన చదువు అంతా పాకిస్తాన్ లోని లాహోర్ లో చేసినట్టు ఉంటుంది. కావున పోస్ట్ లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కన్నీరు పెట్టాడు అనేది తప్పు.
చివరగా, కన్నీరు పెట్టుకుంది ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కాదు. తను ఒక NGO సెక్రెటరీ జనరల్.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?