‘అత్యాచారం మా సంస్కృతిలో ఉంది. ఆటోలో ముగ్గురు మగవాళ్ళున్నప్పుడు ఆడపిల్ల ఆ ఆటోలో ఎక్కితే అత్యాచారం కాకుండా ఉంటదా’ అని కిరణ్ ఖేర్ అన్నట్లుగా కొంతమంది ఫేస్బుక్ లో పోస్టు లు పెడ్తున్నారు. ఆ పోస్ట్ లో చేసిన ఆరోపణల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

క్లెయిమ్ (దావా): ‘అత్యాచారం మా సంస్కృతిలో ఉంది. ఆటోలో ముగ్గురు మగవాళ్ళున్నప్పుడు ఆడపిల్ల ఆ ఆటోలో ఎక్కితే అత్యాచారం కాకుండా ఉంటదా’ అని కిరణ్ ఖేర్ అన్నారు.
ఫాక్ట్ (నిజం): కిరణ్ ఖేర్ చండీగఢ్ లో ఒక యువతిని ఆటో డ్రైవర్ రేప్ చేసిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలను మార్చి కొంతమంది తప్పుగా ప్రచారం చేస్తున్నారు. పోస్టులో పెట్టిన వ్యాఖలను కిరణ్ ఖేర్ చేయలేదు. కావున, పోస్టులో చేసిన ఆరోపణలో ఎటువంటి నిజం లేదు.
కిరణ్ ఖేర్ పైన పోస్టులో పెట్టిన వ్యాఖ్యలు చేసిందా అని వెతికినప్పుడు, ‘ANI News’ వారు ప్రచురించిన ఒక కథనం లభించింది. అందులో కిరణ్ ఖేర్ అత్యాచారాల గురించి మాట్లాడుతూ ‘ఇలాంటి సంఘటనలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మనుషుల మనస్తత్వం మారితేనే పరిస్థితుల్లో మార్పును తెస్తుంది. సమాజంలో మార్పు ఒక కుటుంబం నుండే మొదలవుతుంది” అని అన్నారని తెలిసింది. హర్యానాలో పెరుగుతున్న రేప్ ల సంఖ్య గురించి 2018లో కిరణ్ ఖేర్ మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా ఈ వీడియో లో చూడవచ్చు.

పైన పోస్టులో ఉన్న కిరణ్ ఖేర్ ఫోటో ఆధారంగా వెతికినప్పుడు, కిరణ్ ఖేర్ 2017లో చండీగఢ్ లో ఒక యువతిని ఆటోడ్రైవర్ అత్యాచారం చేసిన సందర్భంలో ‘ANI News’ తో మాట్లాడినప్పటిదని తెలిసింది. దీనికి సంబంధించి ట్విట్టర్ అడ్వాన్స్ సెర్చ్ చేసిన్నప్పుడు, ‘ANI’ వారు పెట్టిన ట్వీట్ లభించింది.
#WATCH BJP MP Kirron Kher says ‘she (Chandigarh rape victim) should not have boarded the auto rickshaw when she saw three men sitting in it’ (29.11.17) pic.twitter.com/Daqe95rTIO
— ANI (@ANI) November 30, 2017
అందులో ఉన్న వీడియోలో కిరణ్ ఖేర్ “ఆమె (చండీగడ్ అత్యాచార బాధితురాలు) ఆటోలో ముగ్గురు పురుషులు కూర్చొని ఉండటాన్ని చూసినప్పుడు ఆమె భద్రతరిత్యా అందులో ఎక్కకుండా ఉండాల్సింది” అని వ్యాఖ్యానించారు. అంతేగానీ, ఆటోలో ముగ్గురు మగవాళ్ళున్నప్పుడు ఆడపిల్ల ఆ ఆటోలో ఎక్కితే అత్యాచారం కాకుండా ఉంటదా అని అనలేదు. అంతకుముందు కూడా కిరణ్ ఖేర్ చేసిన ఈ వ్యాఖ్యలపై వివాదం జరిగినప్పుడు, తాను ఆ వ్యాఖ్యలను ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు బాగాలేనందున కేవలం మహిళల భద్రత దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా వివరణ ఇచ్చారు.
చివరగా, ‘అత్యాచారం మా సంస్కృతిలో ఉంది’ అని బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ అనలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?