లంబాడాలను ప్రపంచంలోనే అత్యంత మేధావులుగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ఎటువంటి ప్రకటన చేయలేదు

‘లంబాడాలను ప్రపంచంలోనే అత్యంత మేధావులుగా, శక్తివంతులుగా గుర్తించిన ఐక్యరాజ్య సమితి’, అంటూ ‘ETV ఆంధ్రప్రదేశ్’ ఛానల్ రిపోర్ట్ చేసినట్టు ఒక న్యూస్ బులిటెన్ స్క్రీన్ షాట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఐక్యరాజ్య సమితి లంబాడాలను ప్రపంచంలోనే అత్యంత మేధావులుగా, శక్తివంతులుగా గుర్తించింది.

ఫాక్ట్ (నిజం): లంబాడాలను ప్రపంచంలోని అత్యంత మేధావులుగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఫోటోలో కనిపిస్తున్న ‘ETV Andhra Pradesh’ బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ ఎడిట్ చేయబడినది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, లంబాడాలను ప్రపంచంలోని అత్యంత మేధావులుగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ఎటువంటి ప్రకటన చేయలేదని తెలిసింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఐక్యరాజ్య సమితి ఎటువంటి ట్వీట్ కూడా చేయలేదు. ఒక వేళ ఐక్యరాజ్య సమితి నిజంగా అలాంటి ప్రకటన చేసివుంటే, దేశంలోని అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్నీ రిపోర్ట్ చేసేవి. కానీ, ఈ విషయాన్ని ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టు మాకు ఆధారాలు దొరకలేదు.

పోస్టులో షేర్ చేసిన న్యూస్ బులెటిన్ కోసం ‘ETV Andhra Pradesh’ యూట్యూబ్ ఛానెల్లో వెతకగా, ఐక్యరాజ్య సమితికి ముడిపెడుతూ ఇలాంటి వార్త ఏది ‘ETV Andhra Pradesh’ న్యూస్ ఛానల్ పబ్లిష్ చేయలేదని తెలిసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ‘ETV Andhra Pradesh’ న్యూస్ టెంప్లెట్ ఎడిట్ చేయబడినది అని చెప్పవచ్చు.

ఇదివరకు, ఐక్యరాజ్య సమితి విశ్వబ్రాహ్మణులని, దళితులని ప్రపంచంలోని అత్యంత మేధావులుగా పరిగణించిందని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఐక్యరాజ్య సమితి అలాంటి ప్రకటనలేవి చేయలేదని స్పష్టం చేస్తూ FACTLY ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరకు, లంబాడాలను ప్రపంచంలోనే అత్యంత మేధావులుగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి ఎటువంటి ప్రకటన చేయలేదు.