‘నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్‌’ పేరుతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదు

Update (07 February 2025): నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్‌ (NRDRM) ఉద్యోగ నోటిఫికేషన్‌ ఫేక్ అని భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ X(ట్విట్టర్)లో ఇచ్చిన వివరణతో ఈ ఆర్టికల్ అప్డేట్ చేయటం జరిగింది.

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్‌లో (NRDRM) 13,762 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిందని, 05 ఫిబ్రవరి 2025 నుంచి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్తూ అనేక పోస్టులు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రకటన ఈనాడు దినపత్రిక 04 ఫిబ్రవరి 2025న ప్రచురించగా సాక్షి, ఈనాడు, నమస్తే తెలంగాణ, టైమ్స్ ఆఫ్ ఇండియా(సమయం), హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, బిగ్ టీవీ, way2news తదితర మీడియా సంస్థలు ఈ నోటిఫికేషన్ వివరాలని తమ పత్రికలు/వెబ్సైట్లలో ప్రచురించాయి. అలాగే, ఈ ఉద్యోగ ప్రకటనను తనిఖీ చెయ్యమని ఫ్యాక్ట్లీ వాట్సాప్ టిప్లైన్ నెంబరుకు (+91 92470 52470) కూడా అభ్యర్థనలు వచ్చాయి. ఈ ఆర్టికల్ ద్వారా ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్‌లో (NRDRM) 13,762 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది.

ఫాక్ట్: ఇది నకిలీ నోటిఫికేషన్ అని గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రదీప్ కుమార్‌ స్పష్టం చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్సైట్లో ఈ పేరుతో ఎటువంటి డిపార్ట్మెంట్ లేదా పథకం లేదు. జూలై 2022లో కూడా ఇదే తరహా పేరుతో ఒక నోటిఫికేషన్ ప్రచారం కాగా అది నకిలీదని గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్సైట్లో ‘నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్‌’ అనే పేరుతో వెతకగా దీనికి సంబంధించిన ఎటువంటి వివరాలు లభించలేదు. గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించే పథకాలలో కూడా ఈ పేరుతో ఎటువంటి పథకం లేదు. అలాగే, ఈ శాఖ ఇటీవల విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలలో కూడా ఈ పేరుతో ఎటువంటి ప్రకటన లేదు.

ఇక నోటిఫికేషన్లో ఇచ్చిన వెబ్సైట్(www.nrdrm.com) గురించి పరిశోధించగా, ఈ వెబ్సైట్ 10 జనవరి 2025లో రిజిస్టర్ చేయబడిందని తెలిసింది. జూలై 2022లో కూడా ఇదే తరహాలో ‘National Rural Development Mission-NRDM (nrdm.in)’ అనే పేరుతో ఒక వెబ్సైట్ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పగా ఇది పూర్తిగా మోసపూరితమైన వెబ్సైట్ అని, దీనితో తమకి ఎటువంటి సంబంధం లేదని గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది.

ఇక, ఈ నోటిఫికేషన్ గురించి గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రదీప్ కుమార్‌ని సంప్రదించగా, ఇది పూర్తిగా నకిలీ నోటిఫికేషన్ అని, ఈ పేరుతో ఎటువంటి డిపార్ట్మెంట్ కానీ, పథకం కానీ లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై దర్యాప్తు చేసి, ఈ వెబ్సైట్ నిర్వహాకులపై తగిన చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలో విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సైబర్ క్రైమ్ పోర్టల్ ఇచ్చిన వివరాల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత శాఖ అధికారిక వెబ్సైట్లో తనిఖీ చేసుకోవాలి. ప్రభుత్వ వెబ్సైట్ల డొమైన్ అడ్రస్లు ‘gov.in’ లేదా ‘nic.in’ తో ముగుస్తాయి.

ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌పై 07 ఫిబ్రవరి 2025న భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తన అధికారిక X(ట్విట్టర్)లో స్పందిస్తూ, “ఈ ఉద్యోగ నోటిఫికేషన్ నకిలీది, మేము ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయలేదు మరియు NRDRM అనే ప్రభుత్వ సంస్థ లేదు” అని స్పష్టం చేసింది. అలాగే, ఇలాంటి నకిలీ ఉద్యోగ నియామక మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు ఇతరులకు అవగాహన కల్పించాలని కూడా పేర్కొంది.

గతంలో కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తూ కొన్ని వెబ్సైట్స్ ప్రచారం కాగా, అవి నకిలీవని నిర్ధారిస్తూ మేము రాసిన ఫాక్ట్-చెక్ కథనాలని ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్‌ పేరుతో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎటువంటి ఉద్యోగ నియామకాలు చెయ్యట్లేదు.