07 మే 2025న పాకిస్థాన్, పీఓకేలో ఉగ్ర శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ దాడుల అనంతరం ఇరు దేశాల సైనిక ఘర్షణ తలెత్తింది. భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య టర్కీ పాక్‌కు మద్దతు ప్రకటించింది. ఈ ఘర్షణలో భారత్‌పై పాకిస్థాన్ దాడికి టర్కీ (తుర్కియో) సైనిక డ్రోన్లు మాత్రమే కాకుండా వాటిని నడిపేందుకు ప్రత్యేక సిబ్బందిని కూడా పంపిందని పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ). దీంతో ఆ దేశ నుంచి దిగుమతి అయ్యే వస్తువులను బహిష్కరించాలని చాలా మంది భారతీయులు స్వచ్ఛందంగానే ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ప్రస్తుతం బాయ్‌కాట్ టర్కీ అనే స్లోగన్ సోషల్ మీడియాలో కూడా బలంగా వినిపిస్తుంది. భారతీయ పండ్ల వ్యాపారులు టర్కీ యాపిల్స్ కాకుండా ఇతర దేశాల యాపిల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు (ఇక్కడ, ఇక్కడ). తాజాగా భారత ప్రభుత్వం దేశంలోని విమానాశ్రయాల్లో సర్వీస్ ప్రొవైడర్‌గా ఉన్న టర్కీకి చెందిన సెలెబీ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేసింది. అలాగే, ఈ రద్దు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో, “బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ను కలిసి కొన్ని వందల కోట్లు విరాళం ఇచ్చాడు” అని క్లెయిమ్ చేస్తూ ఆమిర్ ఖాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో కరచాలనం చేస్తున్న ఫోటో ఒకటి షేర్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ను కలిసి కొన్ని వందల కోట్లు విరాళం ఇచ్చాడు, అందుకు సంబంధించిన ఫోటో.
ఫాక్ట్(నిజం): ఆమిర్ ఖాన్ టర్కీ ప్రభుత్వానికి వందల కోట్లు విరాళం ఇచ్చినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఈ వైరల్ ఫోటో అక్టోబర్ 2017లో ఆమిర్ ఖాన్ తన చిత్రం ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ప్రచారంలో భాగంగా టర్కీ వెళ్ళినప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ను ఆయన అధ్యక్ష భవనంలో కలిసినప్పటిది. రిపోర్ట్స్ ప్రకారం, అమీర్ ఖాన్ 14 అక్టోబర్ 2017న “హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్? (Who Wants to be a Millionaire?)” అనే టర్కిష్ గేమ్ షోలో గెలుచుకున్న 60,000 టర్కిష్ లిరాలను (ప్రస్తుత మారకపు రేటు ప్రకారం సుమారు ₹1,32,321) టర్కీలోని సిరియా శరణార్థులకు మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చాడు. అలాగే 2020 తర్వాత ఆమిర్ ఖాన్ టర్కీని సందర్శించినట్లు కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ను కలిసి కొన్ని వందల కోట్లు విరాళం ఇచ్చాడా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికగా, అమీర్ ఖాన్ టర్కీ ప్రభుత్వానికి అంత మొత్తంలో విరాళం ఇచ్చినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లభించలేదు. ఒకవేళ అతను ఎప్పుడైనా టర్కిష్ ప్రభుత్వానికి అంత పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చి ఉంటే, ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి.
ఈ క్రమంలోనే, 2017లో ఆమిర్ ఖాన్ తన చిత్రం ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ప్రచారంలో భాగంగా టర్కీ వెళ్ళినప్పుడు అధ్యక్షుడు ‘ఎర్డోగాన్’ ని కలిసినట్లు తెలిసింది. 06 అక్టోబర్ 2017న టర్కీ అధ్యక్ష భవనంలో ఆమిర్ ఖాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ను కలిశారని పేర్కొంటూ ఇదే వైరల్ ఫోటోను రిపోర్ట్ పలు మీడియా సంస్థలు అక్టోబర్ 2017లో కథనాలను ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). 07 అక్టోబర్ 2017న, ఇదే ఫోటోను ఇదే వివరణతో టర్కీ అధ్యక్షుడు అధికారిక X(ట్విట్టర్) ఖాతాలో (ఇక్కడ), ముంబైలోని టర్కిష్ కాన్సులేట్ జనరల్ ఫేస్‌బుక్ ఖాతాలో (ఇక్కడ) షేర్ చేయబడింది. రిపోర్ట్స్ ప్రకారం, టర్కీ ప్రభుత్వం ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్‌ను ఆమిర్ ఖాన్‌కు బహూకరించింది.
ఈ పర్యటనలో భాగంగా ఆమిర్ ఖాన్ 14 అక్టోబర్ 2017న టర్కిష్ నటుడు మురాత్ యిల్డిరిమ్ హోస్ట్ చేసిన ప్రసిద్ధ గేమ్ షో “హూ వాంట్స్ టు బి ఎ మిలియనీర్? (Who Wants to be a Millionaire?)” లో పాల్గొన్నాడు, ఈ గేమ్ షోలో అమీర్ ఖాన్ తాను గెలుచుకున్న 60,000 టర్కిష్ లిరాలను (ప్రస్తుత మారకపు రేటు ప్రకారం సుమారు ₹1,32,321) టర్కీలోని సిరియా శరణార్థులకు మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చాడు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
రిపోర్ట్స్ ప్రకారం, 2020 లో ఆమిర్ ఖాన్ తన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కోసం టర్కీని సందర్శించాడు (ఇక్కడ, ఇక్కడ). ఈ పర్యటనలో, ఆమిర్ ఖాన్ 15 ఆగస్టు 2020న టర్కీ ప్రథమ మహిళ ఎమిన్ ఎర్డోగన్‌ను కలిశాడు (ఇక్కడ). రిపోర్ట్స్ ప్రకారం, ఫిబ్రవరి 2020లో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పాకిస్తాన్ పార్లమెంటులో కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తానని ప్రకటించారు, ఈ నేపథ్యంలో ఆగస్టు 2020లో ఆమిర్ ఖాన్ ఎమిన్ ఎర్డోగన్‌ను కలవడంపై పలువురు ఆగ్రహం వ్యక్త చేశారు. అలాగే 2020 తర్వాత ఆమిర్ ఖాన్ టర్కీని సందర్శించినట్లు కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు.
2020లో ఆమిర్ ఖాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ని కలిసినట్లు పేర్కొంటూ ఇదే ఫోటో వైరల్ కాగా ఈ వైరల్ ఫోటో 2017 నాటది అని చెప్తూ Factly ఫాక్ట్-చెక్ కథనాన్ని ప్రచురించింది (ఇక్కడ).
చివరగా, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు వందల కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ వైరల్ ఫోటో 2017 నాటిది.