‘Safe Shop India’ ఈ-కామర్స్ కంపెనీ అసోసియేట్ ని కొడగు జిల్లా కలెక్టర్ గా ప్రచారం చేస్తున్నారు

కేరళ లోని త్రివేండ్రంలో మెడికల్ కాలేజీ లో నర్సుగా పనిచేస్తూ IAS పూర్తి చేసి కొడగు జిల్లా కలెక్టర్ అయి కరోనా వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు చేపట్టారు, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కరోన నివారించడంలో తీసుకున్న చర్యలని అభినందిస్తూ ప్రజలు ఆ కలెక్టర్ ని సన్మానిస్తున్న దృశ్యమంటూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

 ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కొడగు జిల్లా కలెక్టర్ ని ప్రజలు సన్మానిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులలో కనిపిస్తున్న ఆ అమ్మాయి కొడగు జిల్లా కలెక్టర్ కాదు, Safe Shop India’ అనే ఈ-కామర్స్ కంపెనీ అసోసియేట్ నజియా బేగం. ‘Safe Shop India’ కంపెనీ స్టాఫ్ నజియా బేగంని ఘనంగా ఆహ్వానిస్తున్నప్పుడు తీసిన వీడియో ఇది అని విశ్లేషణలో తెలిసింది. కావున, పోస్టులలో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులలో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని ఒక యూట్యూబ్ యూసర్ ‘20 ఫిబ్రవరి 2020’ నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. వీడియోలో కనిపోస్తుంది ‘Safe Shop India’ కంపెనీ కి చెందిన నజియా బేగం అని వివరణలో తెలిపారు. ఇదే వివరణతో మరొక యూసర్ కూడా ఈ వీడియోని యూట్యూబ్లో పోస్ట్ చేసారు. ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోలోని వ్యక్తి గురించిన మరింత సమాచారం కోసం వెతకగా, తమ కంపెనీలో పనిచేస్తున్న నజియా బేగం యొక్క విజయ గాధని వివరిస్తూ ‘Safe Shop India’ కంపెనీ వారు తమ ఫేస్బుక్ పేజి లో పెట్టిన వీడియో దొరికింది. పోస్టులలో కనిపిస్తున్న అదే వ్యక్తి, ఈ వీడియోలో ‘Safe Shop India’ కంపెనీలో తన గెలుపుని వివరిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు.

Safe Shop India’ అనే ఈ-కామర్స్ కంపెనీ ఫాషన్, హెల్త్ మరియు లైఫ్ స్టైల్ కి సంబంధించిన వస్తువులను అమ్ముతుంటుంది. ‘Safe Shop India’ కంపెనీ స్టాఫ్ నజియా బేగంని ఘనంగా ఆహ్వానిస్తున్నప్పుడు తీసిన మరికొన్ని వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఈ కంపెనీ పై చాలా మంది వినియోగదారులు ‘కన్స్యూమర్ కంప్లైంట్ ఫోరమ్’ లో కంప్లైంట్స్ ఫైల్ చేసినట్టు తెలిసింది. అంతేకాదు, 2019లో ఈ ‘Safe Shop India’ కంపెనీ కి చెందిన 11 మంది ఉద్యోగులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి తమ కంపెనీ లో భాగస్వామి కావాలని ప్రజలకు కమిషన్ రూపంలో ఆశ చూపించి మోసం చేసిన నేరంలో వీరిని పోలీసులు అరెస్ట్ చేసారు.

గతంలో ఇదే వీడియోని హత్రాస్ అత్యాచార ఆరోపిత బాధితురాలుగా ప్రచారం అవ్వగా, అది తప్పని చెప్తూ ‘Factly’ రాసిన ఆర్టికల్ ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ‘Safe Shop India’ ఈ-కామర్స్ కంపెనీ అసోసియేట్ ని కొడగు జిల్లా కలెక్టర్ గా చిత్రీకరిస్తున్నారు.