2024 సెప్టెంబర్ మొదటివారంలో ఫిలిప్పీన్స్, చైనా, వియత్నాం, హాంకాంగ్ మొదలగు ఆగ్నేయాసియా దేశాలలో యాగి తుఫాను కారణంగా ప్రాణ మరియు ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో యాగి తుఫాను హాంకాంగ్‌లో భీభత్సం సృష్టించిందని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ వీడియోలో తుఫాను వేగానికి వాహనాలు కొట్టుకుపోవడం, పైకప్పు కూలిపోవడం, రోడ్డులు ధ్వంసం అవడం చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: సెప్టెంబర్ 2024లో హాంకాంగ్‌లో యాగి తుఫాను సంభవించినప్పటి దృశ్యాలు.
ఫాక్ట్: వైరల్ వీడియోలోని దృశ్యాలను కనీసం 2023 నుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి వేర్వేరు సందర్భాల్లో తీసిన వీడియోలు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని సెప్టెంబర్ 2023లోనే (ఆర్కైవ్) ఒక యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి ఉండడం గుర్తించాం. దీన్ని బట్టి ఈ వీడియోలోని దృశ్యాలు 2024 సెప్టెంబర్ మొదటివారంలో వచ్చిన యాగి తుఫానుకు సంబంధించినవి కావని నిర్ధారించవచ్చు.
ఇక వైరల్ వీడియోలోని క్లిప్పింగ్స్ గురించి మరింత పరిశోధించగా ఇవి గతంలో వేర్వేరు సందర్భాల్లో తీసినవిగా గుర్తించాం. ఉదాహరణకు ఒక భవనం వెనుక సుడిగాలి (టోర్నడో) వస్తున్న వీడియో కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా రూపొంచించిన వీడియో. దీని గురించి ఇదివరకే మేము ఒక ఫాక్ట్ చెక్ కథనాన్ని ప్రచురించాం.
అలాగే, మరొక క్లిప్పింగ్‌లో తుఫాను తీవ్రతకు ఒక స్టేడియం పైకప్పు ధ్వంసం కావడం చూడవచ్చు. అయితే ఈ దృశ్యాలు 2023 నుంచి ఇంటర్నెట్లో ఉన్నట్లు గుర్తించాం. జూలై 2023లో వచ్చిన డోకుసురి తుఫాను కారణంగా చైనాలోని క్వాన్జౌ స్పోర్ట్స్ సెంటర్ పైకప్పు దెబ్బతిన్న దృశ్యాలంటూ చైనా మీడియా ఈ వీడియోని రిపోర్ట్ (ఇక్కడ, ఇక్కడ) చేసింది.
యాగి తుఫాను యొక్క దృశ్యాలంటూ మరికొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, వాటి గురించి మేము రాసిన ఫాక్ట్ చెక్ ఆర్టికల్‌ను ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, యాగి తుఫాను హాంకాంగ్‌లో సృష్టించిన భీభత్సం అంటూ పాత వీడియోలను షేర్ చేస్తున్నారు.